Telangana Higher Education: ఫీజు బకాయిలపై ఫైట్.. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల బంద్

Telangana Higher Education Fee Dues Spark Engineering Colleges Strike From November 3
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే కారణం
  • దీపావళిలోపు రూ.300 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ విఫలం
  • బంద్‌కు పిలుపునిచ్చిన ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కాలేజీల సమాఖ్య
  • అక్టోబర్ 22న ప్రభుత్వానికి బంద్ నోటీసు ఇవ్వనున్న యాజమాన్యాలు
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం మరోసారి భగ్గుమంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసివేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫాతీ) నిర్ణయించింది.

గతంలో ఫీజు బకాయిల సమస్యపై అక్టోబర్ 13 నుంచే బంద్‌కు వెళ్లాలని యాజమాన్యాలు భావించాయి. అయితే, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. దీపావళి పండగలోపు రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీతో కాలేజీల యాజమాన్యాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నాయి.

అయితే, పండగ వచ్చినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశమైన ‘ఫాతీ’ కార్యవర్గం, బంద్‌కు వెళ్లడమే శరణ్యమని తీర్మానించింది. తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేస్తూ 22న ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బంద్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి అన్ని వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్న కాలేజీలు పాల్గొననున్నాయి. యాజమాన్యాలు ఇచ్చే నోటీసుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి.
Telangana Higher Education
Fee Reimbursement
Engineering Colleges Bandh
Private Colleges Telangana
Vem Narender Reddy
Telangana Education News
FATHE Telangana
Professional Colleges Strike
Telangana Government
Education Fee Dues

More Telugu News