Nara Lokesh: ఏపీకి ఆస్ట్రేలియా టాప్ వర్సిటీ చేయూత.. విద్య, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యానికి మంత్రి లోకేశ్ ప్రతిపాదన

Nara Lokesh Australian Top University Support for AP Education Technology
  • ఆస్ట్రేలియాలోని యూఎన్ఎస్‌డబ్ల్యూ యూనివర్సిటీని సందర్శించిన లోకేశ్
  • ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని కీలక ప్రతిపాదన
  • స్టూడెంట్ ఎక్స్ఛేంజ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లపై ప్రధానంగా చర్చ
  • ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి పిలుపు
  • ఏపీలో స్టార్టప్‌ల కోసం ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటుకు విజ్ఞప్తి
  • ప్రపంచ టాప్-50 వర్సిటీల్లో ఒకటిగా యూఎన్ఎస్‌డబ్ల్యూకి గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లో విద్య, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక అడుగు వేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (యూఎన్ఎస్‌డబ్ల్యూ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థులు, యువత, పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే పలు కీలక రంగాల్లో కలిసి పనిచేయాలని యూనివర్సిటీ ప్రతినిధులను కోరారు.
      
మంత్రి లోకేశ్‌కు ఘనస్వాగతం పలికిన యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశోధకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్టెమ్ (ఎస్‌టీఈఎం) పునరుత్పాదక ఇంధన వనరుల వంటి అధునాతన టెక్నాలజీలలో ఏపీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్థానిక స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ ఇన్నోవేషన్ సెంటర్ మద్దతుతో ఏపీలో ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

అంతేకాకుండా, సుస్థిర వ్యవసాయం, నీటి నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిశోధనల్లో ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. టెలీ మెడిసిన్, ప్రజారోగ్యం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, సుపరిపాలన వంటి అంశాల్లోనూ యూఎన్ఎస్‌డబ్ల్యూ తమ నైపుణ్యాన్ని ఏపీ ప్రభుత్వంతో పంచుకోవాలని ఆయన కోరారు.

ఈ ప్రతిపాదనలపై స్పందించిన యూఎన్ఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు తమ యూనివర్సిటీ ఘనతను, భారత్‌తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. 1949లో ప్రారంభమైన తమ యూనివర్సిటీ, ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-50 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. ఇప్పటికే భారత్‌లోని ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాసు వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, హైదరాబాద్, బెంగళూరు టెక్ హబ్‌లలో ఏఐ, ఎంఎల్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. సౌరశక్తి, ప్రజారోగ్యం వంటి అంశాల్లో భారత సంస్థలతో తమకు భాగస్వామ్యం ఉందని, లోకేశ్ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం.
Nara Lokesh
Andhra Pradesh
UNSW
University of New South Wales
AP Education
AP Technology
Skill Development
Artificial Intelligence
Renewable Energy
Student Exchange Program

More Telugu News