Smriti Mandhana: భారత ఓటమికి కారణం నేనే.. కన్నీళ్లతో అంగీకరించిన మంధాన

Smriti Mandhana Accepts Responsibility for India Loss
  • ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమి
  • గెలిచే మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం
  • తన షాట్ సెలక్షన్ వల్లే ఓడిపోయామన్న మంధాన 
  • 88 పరుగుల వద్ద మంధాన ఔట్
  • భారత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి
మహిళల ప్రపంచకప్‌లో గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిపోవడంపై భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేసింది. అనవసరమైన షాట్ ఆడి ఔట్ కావడం వల్లే జట్టు ఓటమి పాలైందని అంగీకరించింది.

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో 289 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఒక దశలో పటిష్ఠ స్థితిలో నిలిచింది. స్మృతి మంధాన (88), హర్మన్‌ప్రీత్ కౌర్ మూడో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, కీలక సమయంలో మంధాన అనవసర షాట్‌కు ప్రయత్నించి స్పిన్నర్ లిన్సే స్మిత్ బౌలింగ్‌లో అవుటైంది. ఆ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. చివరి 52 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో వికెట్లు కోల్పోయి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంధాన మాట్లాడుతూ "మేం కుప్పకూలిపోయామన్నది నిజం. ఆ దశలో మా షాట్ సెలక్షన్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా అది నాతోనే మొదలైంది కాబట్టి, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. నా షాట్ సెలక్షన్ ఇంకా తెలివిగా ఉండాల్సింది. ఓవర్‌కు ఆరు పరుగులే అవసరమైనప్పుడు, మేం మ్యాచ్‌ను మరింత లోతుకు తీసుకెళ్లాల్సింది. కాబట్టి, ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే" అని తెలిపారు.

"క్రికెట్‌లో ఏదీ సులభంగా రాదు. ఈ ఓటమిని మేం ఒక పాఠంగా తీసుకుంటాం. తర్వాతి మ్యాచ్ మాకు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది" అని ఆమె పేర్కొన్నారు. ఈ ఓటమితో భారత్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మరోవైపు, ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను 23న నవీ ముంబైలో న్యూజిలాండ్‌తో ఆడనుంది.
Smriti Mandhana
India Women Cricket
Womens World Cup
England Women Cricket
Harmanpreet Kaur
Cricket World Cup
Holkar Stadium
Lindsey Smith
India vs England
Womens Cricket

More Telugu News