Hong Kong Airport Accident: హాంకాంగ్‌లో విమాన ప్రమాదం .. ఇద్దరి మృతి

Hong Kong Airport Accident Two Deaths Reported
  • హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద టర్కీ కార్గో విమానానికి ప్రమాదం
  • ల్యాండింగ్ సమయంలో రన్ వేపై వాహనాన్ని ఢీకొని సముద్రంలోకి జారిపోయిన వైనం
  • ప్రమాదం జరిగిన రన్ వే తాత్కాలికంగా మూసివేత
  • స్వల్ప గాయాలతో బయటపడిన నలుగురు విమాన సిబ్బంది
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం వేకువజామున జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒక కార్గో విమానం రన్‌వే నుంచి జారిపడి సముద్రంలో పడిపోయింది. ఈ ఘటనలో విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది ఇద్దరు మృతి చెందగా, విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, దుబాయ్ నుంచి హాంకాంగ్ వచ్చిన టర్కీకి చెందిన ఎయిర్ ఏసీటీ ఎయిర్‌లైన్స్ కార్గో విమానం ఉదయం 3:50 గంటల సమయంలో ల్యాండింగ్ చేస్తుండగా రన్‌వేపై ఉన్న ఒక వాహనాన్ని ఢీకొని సముద్రంలోకి జారిపోయింది.

సివిల్ ఏవియేషన్ విభాగం తెలిపిన సమాచారం ప్రకారం, రన్‌వేపై పనిచేస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది సముద్రంలో పడిపోయారు. వారిని వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వారు మరణించారు. విమాన సిబ్బందిలో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేయగా, మిగతా రెండు రన్‌వేల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలను ఘటనాస్థలికి పంపింది.

ఈ ప్రమాదం తర్వాత కనీసం 11 కార్గో విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా పరంగా అత్యుత్తమ రికార్డు కలిగిన హాంకాంగ్ విమానాశ్రయంలో ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఎమిరేట్స్ సంస్థ ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన చేయలేదు. 
Hong Kong Airport Accident
Hong Kong
Cargo Plane Crash
Plane Accident
Airport Accident
Air ACT Airlines
Dubai to Hong Kong Flight
Runway Accident
Flight Services Cancelled
Emirates Airlines

More Telugu News