Louvre Museum: లవ్రే మ్యూజియంలో భారీ దోపిడీ.. కేవలం 7 నిమిషాల్లోనే నెపోలియన్ నగలు మాయం!

Louvre Museum Robbery Napoleon Jewels Stolen in 7 Minutes
  • పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో భారీ చోరీ
  • నెపోలియన్ కాలం నాటి 9 విలువైన ఆభరణాలు అపహరణ
  • నిర్మాణ ప్రాంతం నుంచి మ్యూజియంలోకి చొరబడిన దొంగలు
  • దర్యాప్తు కోసం మ్యూజియాన్ని మూసివేసిన అధికారులు
  • గతంలో ఇదే మ్యూజియం నుంచి మోనాలిసా చిత్రం కూడా చోరీ
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన లవ్రే మ్యూజియంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు, కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే తమ పని పూర్తి చేసి విలువైన పురాతన ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘటన పారిస్‌లో తీవ్ర కలకలం రేపింది.

ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్‌ ఈ దోపిడీ వివరాలను వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మ్యూజియంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇందుకోసం వారు హైడ్రాలిక్ నిచ్చెన ఉపయోగించారని, ఫెన్సింగ్‌ను డిస్క్ కట్టర్లతో కోసేశారని అధికారులు గుర్తించారు.

మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి ప్రవేశించిన దొంగలు, అక్కడి అద్దాల ప్రదర్శన పెట్టెలను పగలగొట్టి నెపోలియన్ కాలానికి చెందిన తొమ్మిది అత్యంత విలువైన వస్తువులను, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న ఈ మ్యూజియంలో చోరీ జరగడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ మ్యూజియంలో మెసపొటోమియా, ఈజిప్టు నాగరికతలకు చెందిన సుమారు 33 వేల పురాతన వస్తువులు, శిల్పాలు ఉన్నాయి. రోజూ దాదాపు 30 వేల మంది దీనిని సందర్శిస్తుంటారు.

ఈ మ్యూజియంలో దోపిడీ జరగడం ఇదే మొదటిసారి కాదు. 1911లో మ్యూజియంలోనే పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి విన్సెంజో, ప్రఖ్యాత మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు. రెండేళ్ల తర్వాత ఇటలీలో దానిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు. ప్రస్తుతం దోపిడీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అందుకే ఆదివారం మ్యూజియాన్ని మూసివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
Louvre Museum
Louvre Museum Robbery
Paris
Napoleon Jewelry
Art Heist
France
Mona Lisa
Laurent Nunez

More Telugu News