Yarada Beach: విశాఖలో విషాదం... యారాడ బీచ్ లో ఇద్దరి గల్లంతు

Yarada Beach Tragedy Two Drown in Visakhapatnam
  • గాజువాక కైలాశ్‌నగర్‌కు చెందిన గణేశ్, పెదగంట్యాడకు చెందిన పవన్ గల్లంతు
  • సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది 
  • చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం 
విశాఖ యారాడ బీచ్‌లో విషాదం సంభవించింది. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చిన ఇద్దరు యువకులు బలమైన కెరటాల తాకిడికి గల్లంతయ్యారు.

మెరైన్ ఏఎస్సై శ్రీనుబాబు, జీవీకే శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక నుంచి తొమ్మిది మంది స్నేహితులు యారాడ బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. వారిలో గాజువాక కైలాశ్ నగర్‌కు చెందిన పి. గణేష్ (17), పెదగంట్యాడకు చెందిన పవన్ (27) సముద్రంలో స్నానానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న మెరైన్ పోలీసులు వారిని హెచ్చరించారు. అయితే, వారు హెచ్చరికలను ఖాతరు చేయకుండా సముద్రంలోకి దిగి స్నానం చేస్తుండగా, బలమైన కెరటాలు వారిని లోపలికి లాగేశాయి.

వెంటనే అప్రమత్తమైన లైఫ్‌గార్డ్స్ తాతారావు, శ్రీను, రవి సముద్రంలో వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతరం మెరైన్ సీఐ రమేష్ ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది.

గల్లంతైన గణేష్ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అని, పవన్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Yarada Beach
Visakhapatnam
beach accident
drowning
Ganesh
Pavan
Vizag
Andhra Pradesh
sea rescue
coastal guard

More Telugu News