Harmanpreet Kaur: మహిళల ప్రపంచ కప్: ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి

Harmanpreet Kaur India loses to England in thrilling World Cup match
  • ఇంగ్లండ్ చేతిలో 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం
  • సెంచరీతో చెలరేగిన హీథర్ నైట్
  • స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధశతకాలతో పోరాటం
  • ఆల్ రౌండ్‌ షోతో ఆకట్టుకున్న దీప్తి శర్మ (4 వికెట్లు, 50 పరుగులు)
  • 289 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన టీమిండియా
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ఇందోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన (88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ (50) అర్ధశతకాలతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. 289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 6 వికెట్లకు 284 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప స్కోర్లకే ఓపెనర్ ప్రతిక రావల్, హర్లీన్ డియోల్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు సాధించింది. చివర్లో దీప్తి శర్మ వేగంగా ఆడినా, మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. చివరి ఓవర్లో, విజయానికి 14 పరుగులు అవసరం కాగా, టీమిండియా 9 పరుగులే చేయడంతో ఓటమి తప్పలేదు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. హీథర్ నైట్ (109) అద్భుతమైన సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించింది. ఆమెకు అమీ జోన్స్ (56), కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ (38) చక్కటి సహకారం అందించారు.

భారత బౌలర్లలో ఆల్ రౌండర్ దీప్తి శర్మ 4 వికెట్లతో సత్తా చాటింది. శ్రీ చరణికి రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా అమ్మాయిల జట్టు... దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల చేతిలోనూ ఓటమిపాలైంది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 23న నవీ ముంబైలో న్యూజిలాండ్ తో ఆడనుంది. ఆ తర్వాత తన చివరి లీగ్ మ్యాచ్ ను అక్టోబరు 26న బంగ్లాదేశ్ తో ఆడనుంది. సెమీస్ ఆశలు నిలవాలంటే ఈ రెండు మ్యాచ్ ల్లో గెలవడం తప్పనిసరి. అప్పుడు కూడా ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Harmanpreet Kaur
ICC Womens World Cup 2025
Smriti Mandhana
Deepti Sharma
India vs England
Womens Cricket
Holkar Stadium Indore
Heather Knight
Indian Womens Cricket Team
Cricket World Cup

More Telugu News