Chennai: దీపావళి కోసం చెన్నైని వీడిన 18 లక్షల మంది.. నిర్మానుష్యంగా మారిన మహానగరం

Chennai Sees 18 Million Depart for Diwali Festival
  • దీపావళి పండగ కోసం సొంతూళ్లకు పోటెత్తిన చెన్నై వాసులు
  • కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. ప్రయాణికుల అవస్థలు
  • 20,378 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • హైవేలపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, గంటల తరబడి నిరీక్షణ
దీపావళి పండుగ వేళ చెన్నై మహానగరం దాదాపుగా ఖాళీ అయింది. పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడానికి లక్షలాది మంది సొంతూళ్లకు తరలివెళ్లడంతో, నిత్యం జనంతో కిటకిటలాడే నగరం శనివారం సాయంత్రానికి నిర్మానుష్యంగా మారింది. అధికారిక అంచనాల ప్రకారం, సుమారు 18 లక్షల మంది ఇప్పటికే చెన్నైని వీడి తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

సోమవారం దీపావళి జరగనుండటంతో అక్టోబర్ 16 నుంచే ప్రజలు తమ ప్రయాణాలను ప్రారంభించారు. దీంతో చెన్నైలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారులు ప్రయాణికులతో పోటెత్తాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం వీరిలో 9.5 లక్షల మంది రైళ్లలో, 6.15 లక్షల మంది ప్రభుత్వ బస్సుల్లో, మరో రెండు లక్షల మంది ప్రైవేట్ ఓమ్నీ బస్సుల్లో, 1.5 లక్షల మంది సొంత వాహనాల్లో వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఎన్‌ఎస్‌టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు మొత్తం 20,378 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది. రోజూ నడిచే 2,092 బస్సులకు అదనంగా, ప్రతిరోజూ 2,834 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. గడిచిన మూడు రోజుల్లోనే ప్రభుత్వ బస్సుల్లో 6,15,992 మంది ప్రయాణించారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఒక్క శనివారమే 4,926 బస్సుల ద్వారా 2,56,152 మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు.

అయితే, ఎన్ని ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినా కోయంబేడు, మాధవరం, తాంబరం వంటి బస్టాండ్లలో రద్దీ తగ్గలేదు. ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. చెన్నై సెంట్రల్, ఎగ్మోర్, తాంబరం రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీపావళి ప్రత్యేక రైళ్లలో టికెట్లు రోజుల ముందే అమ్ముడయ్యాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు, జీఎస్టీ రోడ్డు వంటి ప్రధాన రహదారులపై ప్రైవేట్ వాహనాలు బారులు తీరాయి. తాంబరం నుంచి చెంగల్పట్టు వరకు వాహనాలు నెమ్మదిగా కదలడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పారనూర్, సింగపెరుమాళ్ కోయిల్ వంటి టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు గంటకు పైగా వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో చెన్నై నగరం మొత్తం పండగ ప్రయాణాలతో హోరెత్తింది.
Chennai
Diwali Chennai
Diwali festival
Tamil Nadu
transportation
bus services
railway
traffic
holiday travel

More Telugu News