Guru Bruno: ట్రైన్ లో పోగొట్టుకున్న వాచ్ ను అరగంటలో వెతికి తెచ్చిన సిబ్బంది

Lost Watch Found Aboard Vande Bharat Train Thanks to Guru Brunos Quick Complaint
  • సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రయాణికుడు.. వైరల్ గా మారిన ట్వీట్
  • రైలు దిగి ఇంటికి వెళ్లాక వాచీ పోయినట్లు గుర్తించిన ప్రయాణికుడు
  • రైల్ మదద్ ద్వారా ఫిర్యాదు చేయగా.. అరగంట తర్వాత ఫోన్ వచ్చిందని వెల్లడి
ప్రయాణాల్లో ఏదైనా వస్తువు పోయిందంటే ఇక అది దొరకడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. విలువైన వస్తువైతే పోలీసులు, కేసు అంటూ తిరిగితే ఎప్పటికో మన అదృష్టం బాగుంటే తిరిగి దొరుకుతుంది. అయితే, తనకు మాత్రం ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైందని, రైలులో పోగొట్టుకున్న వాచీ కేవలం అరగంటలోనే దొరికిందని ట్విట్టర్ యూజర్ ఒకరు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇలా ఫిర్యాదు చేశానో లేదో అరగంటలో తన వాచీ దొరికిందని ఫోన్ వచ్చిందని చెప్పాడు. అది కూడా అర్ధరాత్రి పూట కావడంతో ఆనందంతో పాటు ఆశ్చర్యం వేసిందని, రైల్వే సిబ్బంది అంకితభావానికి ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే..
గురు బ్రూనో అనే న్యూరో సర్జన్ ఇటీవల వందేభారత్ ట్రైన్ లో ప్రయాణించారు. రాత్రి 11 గంటలకు చెన్నైలోని ఎగ్మూర్ స్టేషన్‌ లో దిగి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికెళ్లాక రైలులోని రెస్ట్ రూమ్‌లో తన వాచ్‌ మర్చిపోయినట్లు గుర్తించారు. వెంటనే 'రైల్ మదద్' వెబ్‌సైట్‌ లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 12:28 గంటలకు ఫిర్యాదు చేయగా.. 12:31 గంటలకు రైల్వే హెల్ప్‌ లైన్ నుంచి ఫోన్ చేసి ఫిర్యాదు వివరాలను రైల్వే సిబ్బంది ధృవీకరించుకున్నారు. ఫిర్యాదు వివరాలతో 12:34 గంటలకు ఒక ఎస్‌ఎంఎస్ కూడా వచ్చింది. బ్రూనో ప్రయాణించిన రైలు యార్డ్‌కు వెళ్లిపోయిందని, సిబ్బందిని పంపి తనిఖీ చేయిస్తున్నట్లు సమాచారం అందింది.

45 నిమిషాల్లోనే..
ఆ తర్వాత 1:12 గంటలకు ఆర్‌పీఎఫ్ నుంచి వాట్సాప్‌లో బ్రూనోకు రెండు ఫొటోలు వచ్చాయి. వాటిలో బ్రూనో పోగొట్టుకున్న వాచ్ ఫొటో ఉంది. ఆర్‌పీఎఫ్ సిబ్బంది 1:13 గంటలకు కాల్ చేసి వాచ్ దొరికిందని, అది బ్రూనోదేనా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. స్టేషన్ కు వచ్చి వాచీ తీసుకెళ్లాలని కోరారు. మొత్తం మీద అర్ధరాత్రి ఫిర్యాదు చేసిన 45 నిమిషాల్లోపే రైల్వే సిబ్బంది అంకితభావం వల్ల తన వాచీ తనకు దొరికిందని డాక్టర్ బ్రూనో తన ట్వీట్ లో వెల్లడించారు.
Guru Bruno
Guru Bruno watch
Vande Bharat train
Indian Railways
Rail Madad
Chennai Egmore station
RPF
lost watch
train travel
customer service

More Telugu News