AP High Court: గురుకుల పాఠశాలల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

AP High Court Relief for Gurukul Part Time Teachers
  • తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు ఎటువంటి ఆటంకం కలిగించొదన్న హైకోర్టు
  • పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన కర్రా మాధవి
  • తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు ఏపీ హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఈ ఉపాధ్యాయులను విధులనుంచి తొలగించరాదని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారికి ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకం కలిగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ న్యాపతి విజయ్ ఈ కేసును విచారించారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.

వివిధ జిల్లాలకు చెందిన 24 మంది పార్ట్‌ టైమ్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. 2009 నుంచి నిరంతరంగా పనిచేస్తున్న తమ సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరించకపోవడమే కాకుండా, ఇటీవల విధులకు హాజరుకావద్దని అధికారులు మౌఖికంగా చెప్పారని వారు వాదించారు. తమ సర్వీసును గుర్తించి శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని పిటిషనర్లు కోరారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది కర్రా మాధవి వాదనలు వినిపిస్తూ.. “హైకోర్టు ఇప్పటికే ఫిబ్రవరి 12న ప్రభుత్వం పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు వాటిని పట్టించుకోలేదు. అంతేకాకుండా, విధులకు హాజరుకావొద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం చట్ట విరుద్ధం” అని తెలిపారు.

ఇక ప్రభుత్వ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ రవికుమార్, ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదిస్తూ, “పార్ట్ టైమ్ టీచర్ల నియామకం కేవలం స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్ భాగంలో జరిగింది. కొనసాగించాలనే హక్కు పిటిషనర్లకు లేదు” అని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు.

కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, పిటిషనర్ల విధులకు ఎటువంటి ఆటంకం కలిగించరాదని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. ఈ తీర్పుతో గత 16 ఏళ్లుగా తాత్కాలికంగా పనిచేస్తున్న గురుకుల పార్ట్‌ టైమ్ ఉపాధ్యాయులకు కొంత ఊరట లభించింది. 
AP High Court
Balayogi Gurukul schools
part time teachers
teacher regularisation
Andhra Pradesh education
Gurukul teachers
Nyapathy Vijay
social welfare department
AP High Court orders
teachers job security

More Telugu News