Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ప్రకటనపై ఉద్యోగ సంఘాలు ఏమన్నాయంటే...!

Chandrababu Naidu Announces  Hike Earned Leave for AP Employees
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు
  • పోలీసు సిబ్బందికి ఈఎల్ సౌకర్యం ప్రకటన
  • సీఎం నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం
  • ప్రభుత్వ చొరవను స్వాగతిస్తున్నామని వెల్లడి
  • గత ప్రభుత్వంలో చర్చలే లేవన్న బొప్పరాజు
  • దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించిన ఆర్టీసీ సంఘం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. పెండింగ్‌లో ఉన్న ఒక బకాయి కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తున్నట్లు, పోలీసులకు ఈఎల్ (Earned Leave) సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సానుకూల నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉప సంఘానికి కృతజ్ఞతలు తెలిపాయి. 

ఉద్యోగ సంఘాలకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించడం తెలిసిందే. ఉద్యోగులకు 1 డీఏ పెంపు, పోలీసులకు ఈఎల్ ప్రకటించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు., ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగులకు, పోలీసులకు సీఎం శుభవార్త చెప్పారని కొనియాడారు. ఒక్కో సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి వర్గ ఉప సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. 

ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ... ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం చొరవచూపిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు కూర్చున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగులతో గత ముఖ్యమంత్రి చర్చించలేదని తెలిపారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ గొప్ప వెసులుబాటు అని బొప్పరాజు అభివర్ణించారు. 

యూటీఎఫ్ అధ్యక్షుడు కూడా దీనిపై హర్షం వెలిబుచ్చారు. ఉపాధ్యాయులకు ఊరటనిచ్చేలా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. మిగిలిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ఆశిస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ ప్రకటనపై ఆర్టీసీ కార్మిక పరిషత్ కూడా స్పందించింది. సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపడం హర్షణీయమని తెలిపింది. ఒక డీఏ చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని వెల్లడించింది. ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆర్టీసీ కార్మిక పరిషత్ వివరించింది. 

Chandrababu Naidu
AP Government Employees
DA Hike
Earned Leave
Police Welfare
Andhra Pradesh
Employee Unions
APNGO
Boparaju Venkateswarlu
UTF

More Telugu News