Delhi High Court: బాగా సంపాదించుకునే భార్యకు భరణం ఎందుకు?: ఢిల్లీ హైకోర్టు

Delhi High Court Why alimony for well earning wife
  • ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యకు భరణంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
  • భరణం సామాజిక న్యాయం కోసమే, సంపద పెంచుకోవడానికి కాదని స్పష్టీకరణ
  • క్రూరత్వం కేసులో భర్తకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు తీర్పు సమర్థన
  • రైల్వే ఉన్నతాధికారిణిగా ఉన్న భార్య భరణం పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
  • సదరు మహిళ విడాకులకు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని గుర్తించిన కోర్టు!
విడాకుల కేసుల్లో శాశ్వత భరణం (Alimony) చెల్లింపుపై ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా, నిలదొక్కుకున్న భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. భరణం అనేది సామాజిక న్యాయంలో ఒక భాగమే తప్ప, దాన్ని సంపద పెంచుకోవడానికి లేదా ఇద్దరి మధ్య ఆర్థిక సమానత్వం తీసుకురావడానికి ఒక సాధనంగా ఉపయోగించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే, న్యాయవాదిగా పనిచేస్తున్న భర్త, గ్రూప్-ఎ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్) అధికారిణిగా పనిచేస్తున్న భార్య 2010 జనవరిలో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన 14 నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తన భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, అవమానకరమైన భాష వాడుతోందని ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలను భార్య ఖండించారు. విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు, భర్త వాదనలతో ఏకీభవిస్తూ క్రూరత్వం కింద విడాకులు మంజూరు చేసింది. అయితే, భార్య కోరిన శాశ్వత భరణం అభ్యర్థనను తిరస్కరించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు మహిళా అధికారిణి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విడాకులకు అంగీకరించాలంటే తనకు రూ. 50 లక్షలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసినట్లు ఫ్యామిలీ కోర్టు గుర్తించిందని, ఈ విషయాన్ని ఆమె తన అఫిడవిట్‌లో, క్రాస్ ఎగ్జామినేషన్‌లో స్వయంగా అంగీకరించారని హైకోర్టు గుర్తు చేసింది. దీనిబట్టి ఆమె వైఖరిలో స్పష్టమైన ఆర్థిక కోణం కనిపిస్తోందని అభిప్రాయపడింది.

భార్య ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా మంచి జీతం సంపాదిస్తూ ఆర్థికంగా బలంగా ఉన్నారని, కాబట్టి ఆమెకు భరణం అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. "నిజంగా ఆర్థిక సహాయం అవసరమైన వారు మాత్రమే భరణం కోరాలి. ఈ కేసులో అప్పీలుదారు (భార్య) ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్నది కొద్ది కాలమే, వారికి పిల్లలు లేరు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు" అని పేర్కొంటూ ఆమె పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Delhi High Court
alimony
divorce case
permanent alimony
financial independence
working wife
maintenance
social justice
Indian Railway Traffic Service
IRTS

More Telugu News