Nadendla Manohar: ఈసారి ధాన్యం కొనుగోలు పండుగలా జరగాలి: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Focuses on Smooth Paddy Procurement
  • రైతులకు ఎలాంటి కష్టం రాకూడదన్న మంత్రి నాదెండ్ల
  • ధాన్యం సేకరణపై ప్రభుత్వ పక్కా ప్రణాళిక
  • గోనె సంచులు, రవాణా, లేబర్ సమస్యలు రాకుండా ముందస్తు ఏర్పాట్లు
  • దళారులను అరికట్టేందుకు పోలీసులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ
  • పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడితే మిల్లర్లపై కఠిన చర్యలు
  • రైతులకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునే పూర్తి స్వేచ్ఛ కల్పన
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విజయవాడలోని హోటల్ వివాంతలో నేడు మంత్రి నాదెండ్ల అధ్యక్షతన అధికారులకు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ జరిగింది. ఈ వర్క్‌షాప్‌ను ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలతో పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గోనె సంచులు, లేబర్, ట్రాన్స్‌పోర్ట్ వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గోనె సంచుల సరఫరాలో దళారులను అరికట్టడానికి జాయింట్ కలెక్టర్లు చొరవ తీసుకోవాలని, దీనికి సంబంధించి జిల్లా పోలీసు శాఖ నుంచి ప్రత్యేక విధివిధానాలు విడుదల చేస్తామని తెలిపారు.

పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌కు వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు ఇచ్చిన హామీని అమలు చేయాలని అధికారులకు మంత్రి నిర్దేశించారు. ఈ అంశాన్ని అగ్రిమెంట్లలో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించారు. ఎఫ్ సీఐకి 60 రోజుల్లో బియ్యం సరఫరా చేసే రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తామని, ప్రతి అంశం డాష్‌బోర్డులో అందుబాటులో ఉంటుందని చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అధికారులు పిలుపునిచ్చారు.

గత ఏడాది అకాల వర్షాల కారణంగా 30,000 టార్పాలను పంపిణీ చేసినట్లు గుర్తు చేస్తూ, ఈసారి కూడా అవసరాన్ని బట్టి ముందస్తుగా టార్పాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ విధానాల ద్వారా రైతులకు స్వేచ్ఛను కల్పించిందని అన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు, నచ్చిన సమయంలో ధాన్యం విక్రయించుకునే అవకాశం కల్పించామని చెప్పారు.

రైతులు సులభంగా వాట్సాప్‌లో “HI” అని సందేశం పంపడం ద్వారా ధాన్యం విక్రయ ప్రక్రియలో చేరే సౌకర్యాన్ని కల్పించామని, విక్రయించిన 24 నుంచి 48 గంటలలోపే రైతు ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాలను గుర్తు చేశారు.

ఈ వర్క్‌షాప్‌లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్, సివిల్ సప్లై కార్పొరేషన్ వీసీ & ఎండీ ఢిల్లీ రావు, వ్యవసాయ శాఖ ఎండి మంజీర్ జిలాని, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్. గోవిందరావు, ఎఫ్ సీఐ జీఎం విజయ్ కుమార్ యాదవ్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై డీఎంలు, డీఎస్ఓలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Nadendla Manohar
Paddy procurement
Civil Supplies Department
Andhra Pradesh
Farmers
Rice millers
PDS rice
Real Time Governance
Agriculture
Vijayawada

More Telugu News