Sattaiah: నిండు గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన మామ.. కులాంతర వివాహమే కారణం!

Komuram Bheem Man kills pregnant daughter in law over inter caste marriage
  • కొమురం భీం జిల్లాలో దారుణ పరువు హత్య
  • ప్రేమ వివాహం చేసుకున్న కుమారుడిపై మామ ఆగ్రహం
  • ఎనిమిది నెలల గర్భిణి అయిన కోడలిపై దాడి
కులం పట్టింపు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కడుపులో బిడ్డను మోస్తున్నదని కూడా చూడకుండా కోడలిని ఓ కసాయి మామ గొడ్డలితో నరికి చంపిన అమానవీయ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు తమ కులం కాని అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళితే.. దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ (బీసీ కులం) అదే గ్రామానికి చెందిన రాణి (ఎస్టీ కులం) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం శేఖర్ తండ్రి సత్తయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. కులాంతర వివాహం చేసుకోవడంపై కుమారుడిపై, కోడలిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు.

ఇదిలా ఉండగా, రాణి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల నిండు గర్భిణి. త్వరలో తమ కుటుంబంలోకి కొత్త బిడ్డ రాబోతోందన్న ఆనందంలో శేఖర్, రాణి దంపతులు ఉన్నారు. వారి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయిన సత్తయ్య, కిరాతకంగా ప్రవర్తించాడు. గర్భిణి అని కూడా కనికరం లేకుండా కోడలు రాణిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
Sattaiah
Komuram Bheem Asifabad
inter caste marriage
murder
pregnant woman
daughter in law
crime news
Gerre village
Dahegaon mandal
Telangana

More Telugu News