Gorantla Buchaiah Chowdary: అమర్నాథ్ గారూ... ఆవేశం వద్దు, గుడ్డే ముద్దు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Buchaiah Chowdary Warns Amarnath on Comments
  • మంత్రి లోకేశ్ పై అమర్‌నాథ్ వ్యాఖ్యలకు టీడీపీ గట్టి కౌంటర్
  • ప్రతిదీ జగన్ పెట్టిన గుడ్డే అంటే పగిలిపోతుందని గోరంట్ల హెచ్చరిక
  • తాను మాట్లాడితే లోకేశ్ ఉరేసుకుంటారని అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
  • గూగుల్ డేటా సెంటర్‌పై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. "పదే పదే జగన్ పెట్టిన గుడ్డే అంటే గుడ్డు పగిలిపోతుంది" అంటూ అమర్‌నాథ్‌కు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. లోకేశ్ గారు చెప్పినట్టు... మీకు, జగన్‌కు సబ్జెక్ట్ తెలియదు, అసలు విషయం తెలియకుండా ఆవేశపడొద్దు... గుడ్డే ముద్దు అని హితవు పలికారు.

అసలేం జరిగిందంటే...

అంతకుముందు, ఏపీకి గూగుల్ రాక నేపథ్యంలో... టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్, మంత్రి లోకేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "లోకేశ్ నన్ను గుడ్డు అంటే, నేను పప్పు అంటాను. దీనివల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటి?" అని ప్రశ్నించారు. తాను వెటకారంగా మాట్లాడటం మొదలుపెడితే లోకేశ్ ఉరేసుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ను "ట్రోలింగ్‌లో జాతిపిత" అని అభివర్ణించిన అమర్‌నాథ్, ఆయనకు వర్ధంతికి, జయంతికి కూడా తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

గూగుల్ డేటా సెంటర్‌పై ప్రశ్నల వర్షం

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అమర్‌నాథ్ తప్పుపట్టారు. ఈ విషయాన్ని గూగుల్ సంస్థతోనే చెప్పించాలని, లేదంటే అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది నిజమని తేలితే తామే ప్రభుత్వానికి సన్మానం చేస్తామని అన్నారు. కొన్ని పత్రికల కథనాల ప్రకారం డేటా సెంటర్ వల్ల కేవలం 200 మందికే ఉద్యోగాలు వస్తాయని, దీనికి అవసరమైన నీరు, విద్యుత్, పర్యావరణ అనుమతులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. తాను కష్టపడి, జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చానని, డబ్బులు కట్టి చదువుకోలేదని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
Gorantla Buchaiah Chowdary
Gudivada Amarnath
Nara Lokesh
Andhra Pradesh Politics
TDP
YCP
Google Data Center
Visakhapatnam
AP Politics
Political Controversy

More Telugu News