Narayana Murthy Family: ఒక్క డివిడెండ్‌తో నారాయణ మూర్తి ఫ్యామిలీకి వందల కోట్లు.. ఎవరికి ఎంతంటే..!

Narayana Murthy Family to Get Rs 347 Crore from Infosys Dividend
  • ఇన్ఫోసిస్ ఒక్కో షేరుకు రూ. 23 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
  • నారాయణ మూర్తి కుటుంబానికి రూ. 347 కోట్ల భారీ మొత్తం
  • కుమారుడు రోహన్ మూర్తికి అత్యధికంగా రూ. 139 కోట్లు
  • నారాయణ మూర్తికి రూ. 34 కోట్లు, సుధా మూర్తికి రూ. 79 కోట్లు
  • ఈ నెల‌ 27 రికార్డ్ డేట్.. నవంబర్ 7న వాటాదారులకు చెల్లింపులు
  • రెండో త్రైమాసికంలో కంపెనీకి రూ. 7,364 కోట్ల నికర లాభం
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన మధ్యంతర డివిడెండ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి కాసుల పంట పండించనుంది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ. 23 చొప్పున డివిడెండ్ ప్రకటించగా, కేవలం మూర్తి కుటుంబానికే ఏకంగా రూ. 347.20 కోట్లు అందనుండటం విశేషం.

ఇటీవల వెల్లడించిన రెండో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ పొందేందుకు ఈ నెల‌ 27ను రికార్డ్ డేట్‌గా కంపెనీ నిర్ణయించింది. ఆ తేదీ నాటికి ఎవరి డీమ్యాట్ ఖాతాలో ఇన్ఫోసిస్ షేర్లు ఉంటాయో, వారికి నవంబర్ 7న డివిడెండ్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

కుటుంబంలో ఎవరికి ఎంతంటే?
మూర్తి కుటుంబంలో అత్యధికంగా ఆయన కుమారుడు రోహన్ మూర్తికి ఈ డివిడెండ్ ద్వారా లబ్ధి చేకూరనుంది. రోహన్‌కు కంపెనీలో 1.64 శాతం వాటా ఉండగా, దీని ద్వారా ఆయనకు రూ. 139.86 కోట్లు అందనున్నాయి. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అర్ధాంగి, నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తికి 1.05 శాతం వాటాకు గాను రూ. 89.60 కోట్లు లభిస్తాయి.

ఇక, నారాయణ మూర్తి అర్ధాంగి సుధా మూర్తి తన 0.93 శాతం వాటాతో రూ. 79.46 కోట్లు అందుకోనున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తికి 0.41 శాతం వాటాపై రూ. 34.83 కోట్లు రానున్నాయి. వీరితో పాటు రోహన్ మూర్తి కుమారుడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి పేరిట ఉన్న 0.04 శాతం వాటాకు రూ. 3.45 కోట్లు జమ కానున్నాయి.

ఆకట్టుకున్న క్యూ2 ఫలితాలు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అద్భుతమైన పనితీరు కనబరిచింది. కంపెనీ నికర లాభం 13.2 శాతం వృద్ధితో రూ. 7,364 కోట్లకు చేరగా, ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 44,490 కోట్లుగా నమోదైంది. అయితే, బలమైన ఫలితాలు ప్రకటించినప్పటికీ శుక్రవారం మార్కెట్లో ఇన్ఫోసిస్ షేరు ధర 2.08 శాతం నష్టపోయి రూ. 1440.90 వద్ద ముగిసింది.
Narayana Murthy Family
Narayana Murthy
Infosys
Infosys dividend
Sudha Murthy
Akshata Murthy
Rohan Murthy
IT sector
Indian IT company
Q2 results
stock market

More Telugu News