Jupally Krishna Rao: ఆ బిల్లుపై కేంద్రం మనసు పెడితేనే బీసీలకు న్యాయం: జూపల్లి

Jupally Krishna Rao Says Central Government Must Act on BC Bill
  • ఆమనగల్లులో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్
  • బంద్‌కు మద్దతు ప్రకటించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే నారాయణరెడ్డి
  • 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డంకి అని మంత్రి ఆరోపణ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలనే అడ్డుపడుతోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పంపిన రిజర్వేషన్ల బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని, కేంద్రం చొరవ తీసుకుంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

బీసీ ఐక్య వేదిక పిలుపు మేరకు ఆమనగల్లు పట్టణంలో జరిగిన బంద్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల కోసం మరో ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

"రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా కులగణన చేపట్టారు. ఆ నివేదిక ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చి గవర్నర్‌కు పంపాము. అయితే ఈ ఫైల్ రాష్ట్రపతి వద్ద నిలిచిపోయింది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని జూపల్లి వివరించారు. తరతరాలుగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలు వెనుకబడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ, బీసీ ఐక్య జేఏసీ చేపట్టిన బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు శివలింగం, అల్లాజీ, బాలకృష్ణయ్య, కేశవులు, వెంకటేశ్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
Jupally Krishna Rao
BC Reservations
Telangana
BC Ikyavedika
Rahul Gandhi
Caste Census
Reservation Bill
Narayana Reddy
BC Welfare
Central Government

More Telugu News