Mohammed Shami: అగార్కర్ 'ఫిట్ నెస్' వ్యాఖ్యలకు షమీ కౌంటర్

Mohammed Shami Counters Agarkars Fitness Comments
  • రంజీ మ్యాచ్ లో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ
  • ఈడెన్ గార్డెన్స్ లో తన బౌలింగ్ అందరూ చూశారని వ్యాఖ్య
  • పూర్తి ఫిట్ నెస్ తో ఆడుతున్నానని వెల్లడి
మహ్మద్ షమీ ఫిట్ గా ఉంటే జట్టులోకి ఎందుకు తీసుకోమంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా షమీ స్పందించాడు. తాను ఫిట్ గా లేననే వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియడంలేదన్నాడు. ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్నానని, ఈడెన్ గార్డెన్స్ లో తాను ఎలా బౌలింగ్ చేశానో అందరూ చూశారని చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఉత్తరాఖండ్‌ తో జరిగిన రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ మూడు వికెట్లు తీశాడు.

బెంగాల్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విషయం గుర్తు చేస్తూ షమీ సోషల్ మీడియా వేదికగా అగార్కర్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేను ఎలా బౌలింగ్‌ వేస్తున్నానో మీరందరూ చూశారు. ఇదంతా మీ కళ్ల ముందే జరిగింది. అయినా సరే అతడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. సరే, ఏం చెప్పాలనుకున్నాడో చెప్పనివ్వండి’’ అని షమీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

అగార్కర్ ఏమన్నారంటే..
షమీని ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయాలని భావించామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, అప్పుడు షమీ ఫిట్ గా లేకపోవడంతో పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు. షమీ వంటి బౌలర్‌ ఫిట్‌గా ఉంటే మేం జట్టులోకి ఎందుకు తీసుకోమని అగార్కర్ ఎదురు ప్రశ్నించాడు. దేశవాళీలో మరికొన్ని మ్యాచులు ఆడితే తప్పకుండా అతడి ఫిట్‌నెస్‌ మెరుగ్గా మారుతుందని అన్నాడు. రాబోయే కాలంలో ఫిట్‌గా మారితే అతడికి తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందని అజిత్ అగార్కర్ తెలిపాడు.
Mohammed Shami
Ajit Agarkar
Shami fitness
India cricket
England test series
Ranji Trophy
Eden Gardens
Bengal cricket
Uttarakhand cricket

More Telugu News