Etela Rajender: నా మాట తప్పయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఈటల రాజేందర్

Etela Rajender Ready for Political Sanyas If Proven Wrong on BC Reservations
  • 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపించారన్న ఈటల
  • తమిళనాడు తరహాలో సర్వే చేసి బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్
  • గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను వంచించాయని విమర్శ
బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని ఈటల గుర్తుచేశారు. వాస్తవాలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న బీసీ జనాభా లెక్కలు పూర్తిగా తప్పులతడక అని, 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపడం కాకి లెక్కలు చెప్పడమేనని విమర్శించారు. ప్రభుత్వం నామమాత్రంగా కమిషన్లు వేస్తోందే తప్ప, వాటిని అమలు చేయడంలో నిజాయతీ చూపడం లేదని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీల విషయంలో ఇలాగే వ్యవహరించిందని ఈటల విమర్శించారు. కేసీఆర్ హయాంలో సర్వేలు చేసి, కమిషన్లు వేసినా చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీలకు న్యాయం జరగలేదని అన్నారు. "తమిళనాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు సమగ్ర సర్వే జరిపి, ఆ నివేదికను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్లే అక్కడ రిజర్వేషన్లు పక్కాగా అమలవుతున్నాయి. తెలంగాణలో కూడా అదే విధానాన్ని పాటించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, ఆయన కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ఈటల గుర్తుచేశారు. మాదిగ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత కూడా బీజేపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. "బీసీలు యాచించే స్థాయిలో లేరు, శాసించే స్థాయికి ఎదగాలి. ప్రాంతీయ పార్టీలతో ఆ కుటుంబాలకే అధికారం దక్కుతుంది తప్ప బీసీలకు మేలు జరగదు" అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 
Etela Rajender
BC Reservations
Telangana
Revanth Reddy
BJP
BC Bandh
OBC Ministers
BC Census
KCR
Madiga Reservations

More Telugu News