child death: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి దుర్మరణం.. గచ్చిబౌలిలో విషాదం

Tragedy in Gachibowli 4 Year Old Nikhil Tej Dies After Falling into Sump
  • అంగన్వాడీ కేంద్రానికి పంపిన తల్లిదండ్రులు
  • ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ సంపులో పడ్డ బాలుడు
  • నిర్వాహకులు గమనించకపోవడంతో మృతి
అంగన్వాడీ కేంద్రంలో ఓ నాలుగేళ్ల ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయాడు. ఆయా కానీ, టీచర్ కానీ గమనించకపోవడంతో ఊపిరాడక మరణించాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. పరమేశ్వర్ కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నానక్ రామ్ గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా చిన్న కుమారుడు నిఖిల్ తేజ్(4)ను అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం నిఖిల్ తేజ్ ను తీసుకురావడానికి వెళ్లిన ఆటో డ్రైవర్ కు అంగన్వాడీ కేంద్రంలో బాలుడు కనిపించలేదు. దీంతో అతడు పరమేశ్వర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే పరమేశ్వర్ అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని కుమారుడి కోసం వెతకగా.. భవనం వెనక వైపు ఉన్న సంపులో నిఖిల్ తేజ్ పడి ఉండడం గుర్తించారు. వెంటనే బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో నిఖిల్ తేజ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపింస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
child death
Nikhil Tej
Gachibowli
Hyderabad
Anganwadi center
water sump
negligence
Telangana
Nanakramguda

More Telugu News