Nara Lokesh: ఏపీ అభివృద్ధి అజెండాగా.. మంత్రి లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh to Tour Australia for AP Development Agenda
  • మంత్రి నారా లోకేశ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం
  • ఈ నెల 19 నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటన
  • విశాఖ సీఐఐ సదస్సు కోసం పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం
  • ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించి విద్యావిధానాలపై అధ్యయనం
  • పలువురు ఆస్ట్రేలియా మంత్రులు, పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం మేరకు, ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయన ఆరు రోజుల పాటు అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరులు, సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం, తమ 'స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్'లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేశ్ ‌ను ఆహ్వానించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవలే ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ప్రధానంగా రెండు కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. దీంతోపాటు అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి, అధునాతన విద్యావిధానాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అధ్యయనం చేయనున్నారు.

పర్యటనలో భాగంగా లోకేశ్ ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు. స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్, ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాంతివోంగ్, విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్ వంటి ప్రముఖులతో భేటీ కానున్నారు. అలాగే, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు.

వీటితో పాటు యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపడంతో పాటు మెల్‌బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను పరిశీలిస్తారు. ఈ నెల‌ 19న సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. 24వ తేదీ రాత్రికి తన పర్యటన ముగించుకుని, 25న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Nara Lokesh
AP Development
Australia Tour
Andhra Pradesh
Skills Development
Investment Opportunities
CII Partnership Summit
Visakhapatnam
Education System
Sports Infrastructure

More Telugu News