Kavitha: బీసీ బంద్.. ఆటోలో వచ్చి రోడ్డుపై బైఠాయించిన కవిత

Kavitha Joins BC Bandh Protest in Hyderabad
  • బీసీ బంద్‌కు మద్దతుగా కవిత మానవహారం
  • ఆటోలో వచ్చి ఖైరతాబాద్ చౌరస్తాలో ధర్నా
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్
బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్‌లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత... కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూ అవే పార్టీలు బంద్‌లో పాల్గొనడం "హంతకులే నివాళులు అర్పించినట్లు" ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కవిత తన జాగృతి కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆటోలో రావడం గమనార్హం. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్రంలోని బీసీలు తమకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు బీసీ బిడ్డలను మోసం చేస్తూనే ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

అవసరమైతే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల కోసం పదేళ్ల పాటు ఎన్నికలు జరగలేదన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఐదు నెలలు ఎన్నికలు ఆలస్యమైనా నష్టం లేదని, బీసీలకు న్యాయం జరగడమే ముఖ్యమని కవిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
Kavitha
Kavitha Telangana Jagruthi
BC Reservations
BC Bandh
Telangana BC
KCR Government
Khairatabad
Telangana Politics
BC Rights
BJP Congress

More Telugu News