Mozambique Boat Accident: మొజాంబిక్‌లో ఘోర ప్రమాదం... బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయుల మృతి

Three  Indians Dead and 5 Missing In Mozambique Boat Accident
  • మరో ఐదుగురు భారత సిబ్బంది గల్లంతు
  • ట్యాంకర్ సిబ్బందిని తరలిస్తుండగా జరిగిన ఘటన
  • ఆరుగురిని సురక్షితంగా కాపాడిన సహాయక బృందాలు
  • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత హైకమిషన్
మొజాంబిక్‌లోని బీరా పోర్టు తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయులతో ప్రయాణిస్తున్న ఒక బోటు బోల్తా పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ దురదృష్టకర సంఘటనను మొజాంబిక్‌లోని భారత హైకమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
సముద్రంలో లంగరు వేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్‌లోకి సిబ్బందిని తరలించేందుకు 14 మంది భారతీయులతో ఒక బోటు బయలుదేరింది. శుక్రవారం బీరా పోర్టు సమీపంలో ఈ సిబ్బంది బదిలీ ప్రక్రియ జరుగుతుండగా, అనుకోని రీతిలో బోటు నీటిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో ఆరుగురు భారతీయులను సురక్షితంగా కాపాడగలిగారు. వీరిలో ఒకరు ప్రస్తుతం బీరాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నారని భారత హైకమిషన్ వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు పేర్కొంది. గల్లంతైన మరో ఐదుగురు సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపింది.

"ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబాలతో మేం టచ్‌లో ఉన్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం" అని భారత హైకమిషన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటనలో పేర్కొంది. 

గల్లంతైన వారిని గుర్తించేందుకు స్థానిక సముద్రయాన ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని, హైకమిషన్‌కు చెందిన ఒక కాన్సులర్ అధికారి బీరాలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
Mozambique Boat Accident
Beira Port
Indian Nationals
Boat Capsized
Mozambique
Indian High Commission
Search Operation
Oil Tanker

More Telugu News