Bengaluru Auto Driver: ఆ రాత్రి ఎవరూ రాలేదు, ఆమె తప్ప.. బెంగుళూరులో వైరల్ అయిన 'ఆటో' ఘటన!

Woman Autorickshaw Driver Helps Bengaluru Man At Night Wins Praise Online
  • బెంగళూరులో ఓ వ్యక్తికి ఎదురైన అరుదైన అనుభవం
  • అర్ధరాత్రి ఇంటికి వెళ్లేందుకు ఆటో దొరక్క తీవ్ర ఇబ్బందులు
  • తన డ్యూటీ అయిపోయినప్పటికీ, అతనిని గమ్యస్థానంలో దించిన మహిళా డ్రైవర్
  • తక్కువ ఛార్జీ అడిగిన డ్రైవర్.. ఎక్కువ ఇచ్చి కృతజ్ఞత చెప్పిన ప్రయాణికుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. మహిళా డ్రైవర్ పై ప్రశంసలు
బెంగళూరులో ఓ మహిళా ఆటో డ్రైవర్ చూపిన మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. అర్ధరాత్రి వేళ, గమ్యం చేరేందుకు వాహనం దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి ఆమె అండగా నిలిచిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.

వరుణ్ అగర్వాల్ అనే వ్యక్తి ఇటీవల రాత్రిపూట బెంగళూరులోని ఇందిరానగర్‌లో చిక్కుకుపోయారు. కోరమంగళ వెళ్లేందుకు ఆయన చాలాసేపు ప్రయత్నించినా, ఏ ఆటో డ్రైవర్ ముందుకు రాలేదు. క్యాబ్‌లు కూడా అందుబాటులో లేకపోవడంతో దాదాపు కిలోమీటరు దూరం నడిచారు. ఆ సమయంలో రహదారి పక్కన ఆపి ఉన్న ఆటోలో ఓ మహిళా డ్రైవర్ కనిపించారు.

వరుణ్ ఆమెను ఆపి విషయం చెప్పగా, తన డ్యూటీ సమయం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నానని ఆమె బదులిచ్చారు. దీంతో నిరాశగా వరుణ్ వెనుదిరగగా, ఆమె తిరిగి పిలిచి 'రండి.. కోరమంగళలో డ్రాప్ చేస్తా'నని చెప్పారు. ఈ విషయాన్ని వరుణ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. "నేను వేరే ఆటో చూసుకుంటానని చెప్పినా ఆమె వినలేదు. పట్టుబట్టి నన్ను కోరమంగళ వరకు తీసుకెళ్లారు" అని ఆయన రాసుకొచ్చారు.

గమ్యస్థానానికి చేరిన తర్వాత ఛార్జీ గురించి ప్రస్తావన వచ్చింది. సాధారణంగా ఊబర్ యాప్‌లో ఆ దూరానికి రూ.300 ఛార్జీ చూపిస్తుండగా, ఆమె కేవలం రూ.200 అడిగారు. అది చాలా తక్కువ అని వరుణ్ చెప్పినా ఆమె ఫర్వాలేదన్నారు. అయితే, వరుణ్ పట్టుబట్టి ఆమెకు రూ.300 చెల్లించారు. "ఇటీవలి కాలంలో నా జీవితంలో ఎదురైన అత్యుత్తమ ఆటో అనుభవాల్లో ఇది ఒకటి. మనకు ఇలాంటి మహిళా ఆటో డ్రైవర్లు ఎంతో అవసరం" అని వరుణ్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో బాగా షేర్ అవ్వడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ మహిళా డ్రైవర్ మంచితనాన్ని, నిజాయతీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. "బెంగళూరులో ఇలాంటి అనుభవం ఎదురవడం చాలా సంతోషంగా ఉంది" అని ఒకరు వ్యాఖ్యానించగా, "మంచితనం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం" అని మరొకరు కామెంట్ చేశారు.
Bengaluru Auto Driver
Varun Agarwal
Bengaluru
Auto driver kindness
Koramangala
Indiranagar
Social media appreciation
Women auto drivers
Inspiration
Good deed

More Telugu News