Afghanistan Cricketers: పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి

Three Afghanistan Cricketers Killed in Pakistan Airstrike
  • ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి
  • దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశవాళీ క్రికెటర్ల దుర్మరణం
  • మరో ఐదుగురు సాధారణ పౌరులు కూడా మృతి చెందినట్లు వెల్లడి
  • పాకిస్థాన్‌తో జరగాల్సిన ట్రై-సిరీస్ నుంచి వైదొలగిన ఆఫ్ఘనిస్థాన్
  • ఇది పిరికిపంద చర్య అంటూ ఏసీబీ, కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం 
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తూర్పు పక్తికా ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధికారికంగా ధ్రువీకరించింది. ఈ దాడిలో కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ అనే ముగ్గురు క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు సాధారణ పౌరులు కూడా మరణించినట్లు ఏసీబీ తెలిపింది.

వివరాల్లోకి వెళితే... వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంకతో జరగనున్న ట్రై-సిరీస్‌లో పాల్గొనేందుకు ఈ ఆటగాళ్లు ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణమయ్యారు. అనంతరం తమ స్వస్థలం ఉర్గున్‌కు తిరిగి వచ్చిన తర్వాత, వారు ఒక చోట సమావేశమైన సమయంలో ఈ వైమానిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. "పాకిస్థాన్ ప్రభుత్వం జరిపిన ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఏసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటనకు నిరసనగా, మరణించిన వారికి గౌరవ సూచకంగా పాకిస్థాన్‌తో జరగాల్సిన ట్రై-సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్ల‌డించింది.

ఈ దాడిపై ఆఫ్ఘనిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులతో పాటు దేశం తరఫున ఆడాలని కలలు కంటున్న యువ క్రికెటర్లను పాక్ వైమానిక దాడుల్లో కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల నుంచి వైదొలగాలన్న ఏసీబీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. మరో అంతర్జాతీయ ఆటగాడు మహమ్మద్ నబీ స్పందిస్తూ, "ఈ ఘటన కేవలం పక్తికాకు మాత్రమే కాదు, యావత్ ఆఫ్ఘన్ క్రికెట్ కుటుంబానికి తీరని విషాదం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే పాకిస్థాన్ ఈ దాడులకు పాల్పడినట్లు ఆఫ్ఘన్ మీడియా ఆరోపిస్తోంది. ఉర్గున్, బర్మల్ జిల్లాల్లోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, దీనివల్ల భారీగా ప్రాణనష్టం సంభవించిందని కాబుల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు దోహాలో చర్చలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Afghanistan Cricketers
Pakistan airstrike
Afghanistan cricket board
Kabeer
Sibghatullah
Haroon
Paktika province
Afghanistan cricket
Pakistan
Sri Lanka

More Telugu News