TTD EO: పరకామణి చోరీ కేసు: టీటీడీ ఈవోపై హైకోర్టు సీరియస్

TTD EO Faces High Court Ire in Parakamani Theft Case
  • తిరుమల పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ
  • కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈవోపై ఆగ్రహం
  • ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఈవోకు ఆదేశం
తిరుమల పరకామణిలో జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) వ్యక్తిగతంగా హాజరు కావాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా, టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం ప్రదర్శించారు. కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యంపై ప్రశ్నించారు. ఈ నెల 27న జరిగే తదుపరి విచారణకు ఈవో కచ్చితంగా హాజరుకావాలని, లేనిపక్షంలో రూ. 20 వేల జరిమానా విధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని టీటీడీ తరఫు న్యాయవాది కోరడంతో, కోర్టు ఈ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు, ఇప్పటికే తిరుమల పరకామణిలోని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తునకు సంబంధించిన ప్రాథమిక నివేదికను, సీజ్ చేసిన ఫైళ్లను శుక్రవారం కోర్టుకు సమర్పించారు.

గతంలో రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు 2023లో ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అధికారులు ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరపకుండా లోకాయుక్త ద్వారా రాజీ కుదిర్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోంది.
TTD EO
Tirumala
Parakamani
Theft case
Andhra Pradesh High Court
TTD
Tirupati
Ravi Kumar
CID investigation
Srinivasulu petition

More Telugu News