YS Sharmila: మల్లన్న సాక్షిగా నీచ రాజకీయాలు చేశారు: మోదీపై షర్మిల ఫైర్

YS Sharmila Fires on Modi Over AP Visit and Politics
  • ప్రధాని మోదీపై ఎక్స్‌లో వైఎస్ షర్మిల విమర్శలు
  • కర్నూలులో మోదీ దీపావళి టపాసు తుస్సుమందన్న షర్మిల
  • ఏపీకి వచ్చి బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషమంటూ ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని పర్యటన ఒక "తుస్సుమన్న దీపావళి టపాసు"లాంటిదని ఆమె ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం కట్టారని, శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయాలకు తెరలేపారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మరోసారి ఘరానా మోసం చేశారంటూ మండిపడ్డారు.

శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని షర్మిల విమర్శించారు. "మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రూ. 1,657 కోట్లతో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్ మీకు కనిపించలేదా?" అని ఆమె ప్రశ్నించారు. ఉజ్జయిని, వారణాసి కారిడార్ల అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధ శ్రీశైలం మల్లన్న కారిడార్‌పై ఎందుకు లేదని నిలదీశారు. శ్రీశైలం కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదని, ఇది మల్లన్నకు చేస్తున్న ద్రోహం కాదా? అని అన్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా షర్మిల పలు ప్రశ్నలు లేవనెత్తారు. 11 ఏళ్ల క్రితం తిరుపతిలో చెప్పిన పాత పిట్టకథనే ప్రధాని మళ్లీ చెప్పారని విమర్శించారు. ఢిల్లీకి, రాష్ట్ర రాజధానికి లింక్ పెట్టారని, కానీ అరకొర అప్పులు ఇస్తే అమరావతి ఢిల్లీతో ఎలా పోటీ పడుతుందని ప్రశ్నించారు. కేవలం అప్పులకు హామీలు ఇచ్చినంత మాత్రాన రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందా? అని నిలదీశారు. రాజధానికి లక్ష కోట్ల అప్పులు తెస్తే రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారుతుందని, ప్రగతి ద్వారాలు ఎలా తెరుచుకుంటాయని ఆమె అన్నారు. 
YS Sharmila
Narendra Modi
APCC
Andhra Pradesh
Kurnool
Srisailam
Mallanna
Amaravati
Andhra Pradesh Politics
Election Campaign

More Telugu News