Test Twenty: క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్.. వచ్చేసింది ‘టెస్ట్ ట్వంటీ’

Test Twenty Cricket New Format Launched
  • క్రికెట్‌లో నాలుగో ఫార్మాట్‌.. ‘టెస్ట్ ట్వంటీ’ ఆవిష్కరణ
  • 13-19 ఏళ్ల యువతే లక్ష్యంగా సరికొత్త ఛాంపియన్‌షిప్
  • భారత్‌లోనే తొలి రెండు ఎడిషన్లు.. 2026 జనవరిలో ఆరంభం
  • టెస్టులాగా రెండు ఇన్నింగ్స్‌లు, టీ20లాగా 20 ఓవర్లు
  • హేడెన్, హర్భజన్, క్లైవ్ లాయిడ్, డివిలియర్స్ మద్దతు
  • టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవమే ప్రధాన లక్ష్యం
క్రికెట్ ప్రపంచంలోకి మరో సరికొత్త ఫార్మాట్ అడుగుపెట్టింది. టెస్ట్, వన్డే, టీ20ల సరసన ఇప్పుడు ‘టెస్ట్ ట్వంటీ’ చేరనుంది. టెస్టు మ్యాచ్‌ల వ్యూహం, టీ20ల వేగాన్ని కలగలిపి రూపొందించిన ఈ నూతన ఫార్మాట్‌ను ముంబైలో క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, ఏబీ డివిలియర్స్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ సర్ క్లైవ్ లాయిడ్ అధికారికంగా ఆవిష్కరించారు. యువతరాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఛాంపియన్‌షిప్‌ను తీసుకొస్తున్నారు.

ఏమిటీ టెస్ట్ ట్వంటీ?
ఈ ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌లో మొత్తం 80 ఓవర్లు ఉంటాయి. టెస్టుల మాదిరిగానే ప్రతీ జట్టు రెండు ఇన్నింగ్స్‌లు ఆడుతుంది. అయితే, ప్రతి ఇన్నింగ్స్ 20 ఓవర్లకే పరిమితమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరు రెండో ఇన్నింగ్స్‌లో కలుస్తుంది. అంటే, ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ తరహాలో ఆలోచిస్తూ, టీ20 తరహాలో వేగంగా ఆడాల్సి ఉంటుంది. దీనివల్ల మ్యాచ్ ఫలితాలు త్వరగా వస్తూనే, టెస్టుల అసలైన స్ఫూర్తి నిలిచి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

భారత్‌లోనే తొలి రెండు ఎడిషన్లు
టెస్ట్ ట్వంటీ మొదటి ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభం కానుంది. తొలి రెండు సీజన్లకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత దీనిని టూరింగ్ లీగ్‌గా మార్చి, క్రికెట్ ప్రాబల్యం తక్కువగా ఉన్న దేశాలకు తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాని తెలిపారు. “భారతదేశం క్రికెట్‌కు అతిపెద్ద మార్కెట్, అందుకే ఇక్కడ ప్రారంభిస్తున్నాం. యువ క్రీడాకారులకు ఇతర దేశాల్లో ఆడే అవకాశం కల్పించడమే మా లక్ష్యం. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న యువత తమ గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా స్టేడియంలోకి ప్రవేశించవచ్చు” అని ఆయన వివరించారు.

టెస్టులకు పునరుజ్జీవం కోసమే
ఈ కొత్త ఫార్మాట్‌పై వెస్టిండీస్ దిగ్గజం, రెండు ప్రపంచకప్‌ల విజేత కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ మాట్లాడుతూ, "నేను టెస్ట్ క్రికెట్‌కు పెద్ద అభిమానిని. కానీ ఇటీవలి కాలంలో దానిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక ఆటగాడి అసలైన సత్తా తెలియాలంటే టెస్టులే కొలమానం. ఈ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవం కల్పించడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను, అందుకే దీనికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని అన్నారు.
Test Twenty
Matthew Hayden
Harbhajan Singh
AB de Villiers
Clive Lloyd
cricket format
T20
test cricket
Gaurav Bahirwani
cricket championship

More Telugu News