Nitin Mittal: ఉద్యోగాలకు ఏఐ ముప్పు కాదు.. ఏఐ వాడే మీ సహోద్యోగే అసలు ముప్పు!

AI is not a threat to jobs Your AI savvy colleague is says Nitin Mittal
  • ఏఐతో ఉద్యోగాలకు ముప్పు లేదన్న డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్
  • ఏఐ నేర్చుకున్న సహోద్యోగులే అసలైన పోటీదారులని వ్యాఖ్య‌
  • సాఫ్ట్‌వేర్, కస్టమర్ సపోర్ట్, కోడింగ్ ఉద్యోగాలపై ప్రభావమ‌ని వెల్ల‌డి
  • నైపుణ్యాలు పెంచుకోకపోతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదమంటూ జోస్యం
  • భారత్ సొంత ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయాలని సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన ఉద్యోగాలను లాక్కుంటుందని ఆందోళన చెందడం కంటే, దానిని వేగంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న మన సహోద్యోగుల గురించి ఆందోళన చెందడం మంచిదని డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన పోటీ టెక్నాలజీతో కాదని, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్న తోటి ఉద్యోగులతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ఆయన, "ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా?" అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. "సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు, కోడింగ్ వంటి కొన్ని ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏఐ వల్ల నేరుగా ఒక్క ఉద్యోగం కూడా పోలేదు. ఏఐతో ఎలా పనిచేయాలో తెలుసుకున్న మరో వ్యక్తి వల్లే ఉద్యోగాలు పోతున్నాయి" అని ఆయన వివరించారు.

టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మార్చుకోకుండా, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి చూపకుండా ఖాళీ సమయంలో సోషల్ మీడియా చూస్తూ గడిపేవారు కచ్చితంగా వెనుకబడిపోతారని మిట్టల్ హెచ్చరించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని పక్కనపెట్టి, ఏఐ ద్వారా పుట్టుకొస్తున్న కొత్త ఆర్థిక వ్యవస్థ, అది సృష్టించే సరికొత్త ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

ఏఐ డేటా సెంటర్ నిర్మాణం వంటి ప్రాజెక్టుల వల్ల నిర్మాణ రంగంలో ఉద్యోగాలు పెరగడంతో పాటు స్థానిక తయారీ రంగానికి కూడా ఊతం లభిస్తుందని ఉదాహరణగా చెప్పారు. భారతదేశ సంస్కృతి, భాషలను కాపాడుకోవడానికి దేశీయంగా సొంత ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. 

ప్రతిభ, ఆవిష్కరణలు, వ్యవస్థాపక స్ఫూర్తి వంటి సహజ ప్రయోజనాలను భారత్ ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. అమెరికాలోని వేమో సెల్ఫ్ డ్రైవింగ్ క్యాబ్‌ల గురించి అడగ్గా, వాటిని ఇక్కడ నడపగలమా అని చర్చించడం కంటే, భారతదేశానికి అవసరమైన వాటిని ఇక్కడే ఎలా తయారుచేయగలం అనేదానిపై దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Nitin Mittal
AI
Artificial Intelligence
Jobs
Employment
Technology
Skills
Future of Work
India
NDTV World Summit

More Telugu News