IT Notices: బ్యాంకులో ఎక్కువ డబ్బులు వేస్తున్నారా?.. ఆ ప‌రిమితి దాటితే చిక్కులే.. ఐటీ నోటీసులు రావచ్చు!

IT Department Notices on High Value Bank Deposits
  • సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం
  • అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక 
  • మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో రూ.10 లక్షల పెట్టుబడులపైనా దృష్టి
  • ఆదాయానికి, లావాదేవీలకు పొంతన లేకుంటే నోటీసులు తప్పవు
ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోయినా కొన్నిసార్లు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేవారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ఆదాయ పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తాయి. నిర్దిష్ట పరిమితిని మించి లావాదేవీలు జరిపితే, ఆ వివరాలు నేరుగా ఐటీ అధికారులకు చేరతాయి.

పొదుపు ఖాతాలపై ప్రత్యేక దృష్టి
సాధారణంగా బ్యాంకు పొదుపు ఖాతాల్లో డబ్బు జమ చేయడం, విత్‌డ్రా చేయడం సహజం. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ అన్ని సేవింగ్స్ ఖాతాల్లో కలిపి జమ చేసిన మొత్తం రూ.10 లక్షలు దాటితే, ఆ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను విభాగానికి తెలియజేస్తాయి. ఒకే ఖాతాలో కాకుండా వేర్వేరు ఖాతాల్లో జమ చేసినా, మీ పాన్ కార్డు ఆధారంగా అన్నింటినీ కలిపి లెక్కిస్తారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు కూడా
ఈ నిబంధన కేవలం సేవింగ్స్ ఖాతాలకే పరిమితం కాదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (ఎఫ్‌డీ) కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో కలిపి రూ.10 లక్షలకు మించి ఎఫ్‌డీ చేసినా ఆ వివరాలు ఐటీ శాఖకు వెళ్తాయి. వాటిపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.

అదేవిధంగా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్ల వంటి వాటిలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి పెట్టుబడి పెట్టినా ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో, ఆ పెట్టుబడులకు సంబంధించిన ఆదాయ వనరులను ధ్రువీకరించాలని అధికారులు కోరవచ్చు.

నోటీసులు ఎప్పుడు వస్తాయి?
ఈ లావాదేవీల వివరాలు ఐటీ శాఖ వద్దకు చేరినప్పుడు, మీ ఐటీ రిటర్నుల్లో చూపిన ఆదాయంతో పోల్చి చూస్తారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే, వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు, పత్రాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం.
IT Notices
IT Department
Income Tax
Income Tax Department
Bank Transactions
Savings Account
Fixed Deposits
Mutual Funds
Stock Investments
Financial Transactions

More Telugu News