Khawaja Asif: ఆఫ్ఘన్ ప్రాక్సీ యుద్ధం వెనుక భారత్ ఉంది.. రెండు దేశాలతోనూ యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

Khawaja Asif Accuses India of Proxy War in Afghanistan
  • భారత్, ఆఫ్ఘనిస్థాన్‌తో రెండు వైపుల యుద్ధానికి సిద్ధమన్న పాక్
  • సరిహద్దుల్లో భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చని హెచ్చరిక
  • తమపై ఆఫ్ఘనిస్థాన్ ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఆరోపణ
  • తాలిబన్ల నిర్ణయాల వెనుక ఢిల్లీ స్పాన్సర్‌షిప్ ఉందని వ్యాఖ్య
  • పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు
భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్‌తో కూడా ఒకేసారి యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు భారత్ ప్రయత్నించే అవకాశం ఉందని, తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దు వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో భారత్‌ను కూడా ఈ వివాదంలోకి లాగుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఓ స్థానిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ... సరిహద్దుల్లో భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. "రెండు వైపుల నుంచి యుద్ధం వస్తే ఎలా ఎదుర్కొంటారు అన్న అంశంపై ప్రధానమంత్రితో ఏమైనా సమావేశాలు జరిపారా?" అని యాంకర్ అడగగా, "అవును, మా వ్యూహాలు మాకున్నాయి. వాటిని బహిరంగంగా చర్చించలేను. కానీ, ఎలాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం" అని ఆయన బదులిచ్చారు.

కొన్ని రోజుల క్రితం కూడా ఖవాజా ఆసిఫ్ ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తమపై భారత్ తరఫున "ప్రాక్సీ యుద్ధం" చేస్తోందని ఆయన ఆరోపించారు. "ప్రస్తుతం ఢిల్లీ కోసం కాబూల్ ప్రాక్సీ (పరోక్ష) యుద్ధం చేస్తోంది. తాలిబన్ల నిర్ణయాల వెనుక ఢిల్లీ స్పాన్సర్‌షిప్ ఉంది" అని ఆయన అన్నారు.

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో గత వారం రోజులుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరువైపులా సైనికులు, పౌరులు డజన్ల సంఖ్యలో మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇరు దేశాలు 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తమ దేశానికి చెందిన తెహ్రీక్-ఏ-తాలిబన్ (టీటీపీ) ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా, కాబూల్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ ఉద్రిక్తతల నడుమ పాక్ మంత్రి భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Khawaja Asif
Pakistan
Afghanistan
India
Proxy war
Taliban
Border dispute
TTP
Kabul
Delhi

More Telugu News