Mohammed Ahmed: హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి!

Hyderabad Man Mohammed Ahmed Trapped in Russia Ukraine War
  • ఉద్యోగం ఆశతో రష్యాకు వెళ్లిన హైదరాబాద్ యువకుడు
  • ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి బలవంతంగా పంపిన వైనం
  • తప్పించుకునే ప్రయత్నంలో విరిగిన కాలు
  • తనతో పాటు వచ్చిన 30 మందిలో 17 మంది మృతి చెందారని వెల్లడి
  • భర్తను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి భార్య విజ్ఞప్తి
  • యుద్ధం చేయకుంటే చంపేస్తామని రష్యా ఆర్మీ హెచ్చరికలు
మెరుగైన భవిష్యత్తు కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసికి ఊహించని కష్టం ఎదురైంది. ఉద్యోగం పేరుతో వెళ్లిన అతడిని రష్యా సైన్యం బలవంతంగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి పంపింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్తను రక్షించాలంటూ బాధితుడి భార్య నిన్న కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ (37) స్థానికంగా బౌన్సర్‌గా పనిచేసేవాడు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ముంబైకి చెందిన ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. ఆ ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ 25న రష్యాకు వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక అతడిని మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు.

అహ్మద్‌తో పాటు మరో 30 మందికి రష్యా సైన్యం కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది. అనంతరం, ఉక్రెయిన్‌తో యుద్ధం చేయాలంటూ అహ్మద్‌తో పాటు 26 మందిని ఇటీవల సరిహద్దులకు తరలించింది. మార్గమధ్యంలో వారి నుంచి తప్పించుకునేందుకు అహ్మద్ ప్రయత్నించగా, కింద పడటంతో అతని కాలు విరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్మీ పర్యవేక్షణలోనే అతడు చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల తన భార్య ఫిరదౌస్ బేగంకు ఫోన్ చేసిన అహ్మద్ తన దయనీయ పరిస్థితిని వివరించాడు. తనతో పాటు శిక్షణ తీసుకున్న 30 మందిలో ఇప్పటికే 17 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. "యుద్ధంలో పాల్గొనకపోతే ప్రాణాలు తీస్తామని రష్యా సైన్యం హెచ్చరిస్తోంది" అని తన భర్త చెప్పినట్లు ఫిరదౌస్ తెలిపారు. తన భర్తను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Mohammed Ahmed
Russia
Ukraine war
Hyderabad
Indian citizen
Human trafficking
Foreign Ministry
Job scam
Recruitment fraud
Khairtabad

More Telugu News