Bribe: నల్గొండలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ ఆఫీసర్

Satyanarayana Reddy Fire Officer Caught Taking Bribe in Nalgonda
  • బాణసంచా దుకాణం ఎన్ఓసీ కోసం లంచం డిమాండ్
  • ఫిర్యాదుదారుడి నుంచి రూ. 8,000 తీసుకుంటూ అరెస్ట్
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
  • లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని ప్రజలకు ఏసీబీ సూచన
నల్గొండ జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బాణసంచా దుకాణం ఏర్పాటుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 8,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో నల్గొండ ఫైర్ స్టేషన్ అధికారి ఎ. సత్యనారాయణ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తాత్కాలికంగా బాణసంచా దుకాణం నడుపుకోవడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే, ఈ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి రూ. 8,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. బాధితుడు ముందుగా అనుకున్న ప్రకారం సత్యనారాయణ రెడ్డికి నగదు ఇస్తుండగా, అక్కడే మాటువేసిన ఏసీబీ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. లంచం తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ఏమాత్రం భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు. అంతేగాక‌ వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా లేదా acb.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
Bribe
Satyanarayana Reddy
Nalgonda
ACB
fire officer
fire station
no objection certificate
firecrackers shop
Telangana ACB
corruption

More Telugu News