Kurra Ganesh: గుంటూరు పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్

Kurra Ganesh Honor Killing Seven Arrested in Guntur
  • ఈ నెల 7న నడిరోడ్డుపై కుర్రా గణేశ్ అనే వ్యక్తిని బావమరిది దుర్గారావు మరికొందరితో కలిసి హత్య చేసిన వైనం
  • ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చామన్న గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అజీజ్
  • గణేశ్ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో ముగ్గురు నిందితులకు ఆశ్రయిం కల్పించారన్న డీఎస్పీ
గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఈ నెల 7న జరిగిన కుర్రా గణేశ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అజీజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

దర్యాప్తులో గణేశ్ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో ముగ్గురు వారికి ఆశ్రయం కల్పించినట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నామని ఆయన చెప్పారు. తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కుర్రా గణేష్ పొట్టిగా ఉన్నాడని కక్ష పెంచుకున్న అతని బావమరిది దుర్గారావు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

పెద్దలకు ఇష్టం లేకుండా తన సోదరిని గణేశ్ పెళ్లి చేసుకోవడంతో దుర్గారావు మరి కొందరితో కలిసి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ నెల 7న కత్తులతో పొడిచి చంపాడు. ఈ ఘటన గుంటూరులో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

అరెస్టు చేసిన ఏడుగురినీ కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు తెలిపారు. 
Kurra Ganesh
Guntur
Honor Killing
Durga Rao
Guntur Police
Crime News
Andhra Pradesh
Love Marriage
Murder Case

More Telugu News