Narendra Modi: ట్రంప్-మోదీ మధ్య సంభాషణ జరగనేలేదు: రష్యా చమురు అంశంపై విదేశాంగ శాఖ

Narendra Modi Trump conversation never happened says Foreign Ministry on Russia oil
  • రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేసేందుకు మోదీ అంగీకరించారన్న ట్రంప్
  • అలాంటి చర్చ జరగలేదన్న విదేశాగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్
  • ఇప్పటికే కేంద్రం స్పష్టతనిచ్చిందని వెల్లడి
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఇటువంటి ఫోన్ సంభాషణ ఇరువురు దేశాధినేతల మధ్య జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత్ ఇదివరకే ఒక స్పష్టతనిచ్చిందని ఆయన తెలిపారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు నరేంద్ర మోదీ అంగీకరించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, భారత్ ఈ వ్యాఖ్యలను ఖండించింది.

ఇదివరకే కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమని, వీటి ఆధారంగానే దిగుమతులు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా నుంచి చమురు దిగుమతులు పెంచడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఈ విషయంలో చాలా పురోగతి కనిపించిందని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా భారత్ స్పందించింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ కేంద్రంగా మారిందని ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని విమర్శించింది. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్ పేర్కొంది.
Narendra Modi
Donald Trump
Russia oil
India Russia relations
Oil imports India

More Telugu News