Mahesh Kumar Goud: బీసీ సంఘాల బంద్, కొండా సురేఖ అంశంపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Supports BC Sangala Bandh on Konda Surekha Issue
  • 18న బీసీ సంఘాల బంద్‌కు మద్దతు ప్రకటించిన మహేశ్ కుమార్ గౌడ్
  • బీసీ రిజర్వేషన్ల అంశంపై తాము వెనక్కి తగ్గేది లేదన్న టీపీసీసీ చీఫ్
  • కొండా సురేఖను పిలిచి మాట్లాడుతామన్న మహేశ్ కుమార్ గౌడ్
అక్టోబర్ 18న బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. బంద్ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలతో ఆయన గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో కుల సర్వేలకు ఆద్యుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బంద్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ, బయట మాత్రం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఆమెతో స్వయంగా మాట్లాడతానని తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Mahesh Kumar Goud
BC Sangala Bandh
BC Reservations
Konda Surekha
Telangana Congress

More Telugu News