RO-KO: సరిహద్దులు దాటిన అభిమానం.. పెర్త్‌లో పాక్ అభిమానికి కోహ్లీ, రోహిత్ సర్‌ప్రైజ్

Virat Kohli Rohit Sharma Surprise Pakistan Fan in Perth
  • ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్లు కోహ్లీ, రోహిత్ 
  • పెర్త్‌లో పాకిస్థానీ అభిమానికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఆనందపరిచిన ఆటగాళ్లు
  • అభిమాని కోరగానే ప్రత్యేకంగా బస్సు దిగి వచ్చి సంతకం చేసిన హిట్‌మ్యాన్‌
  • ఏడు నెలల విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రో-కో
  • ఆదివారం నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఉదారతతో ఓ పాకిస్థానీ అభిమాని మనసు గెలుచుకున్నారు. పెర్త్‌లోని టీమ్ హోటల్ బయట తమ కోసం ఎదురుచూస్తున్న అతడికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సంతోషంలో ముంచెత్తారు. ముఖ్యంగా అభిమాని కోరిక మేరకు రోహిత్ శర్మ బస్సు దిగి వచ్చి మరీ సంతకం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

కరాచీకి చెందిన సాహిల్ అనే అభిమాని, ఆసీస్‌తో సిరీస్ కోసం పెర్త్ వచ్చిన భారత ఆటగాళ్లను కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో గురువారం హోటల్ బయట కోహ్లీ, రోహిత్‌లను ఆటోగ్రాఫ్ అడిగాడు. వెంటనే స్పందించిన విరాట్, ఒక ఆర్‌సీబీజెర్సీ, మరొక టీమిండియా జెర్సీపై సంతకం చేసి ఇచ్చాడు. అప్పటికే బస్సులో కూర్చున్న రోహిత్ శర్మను చూసి, సాహిల్ ఆటోగ్రాఫ్ కోసం సైగ చేశాడు. అది గమనించిన రోహిత్, ప్రత్యేకంగా బస్సు దిగి వచ్చి అతడి కోరికను నెరవేర్చాడు.

ఈ ఘటనపై సాహిల్ మాట్లాడుతూ, “కోహ్లీని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా వినయశీలి. నేను ఒక్కసారి అడగ్గానే సంతకం చేశాడు. అలాగే బస్సులో ఉన్న రోహిత్ కూడా నా అభ్యర్థనను మన్నించి కిందకు రావడం గొప్ప విషయం” అని తన ఆనందాన్ని పంచుకున్నాడు.

దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లీ తిరిగి భారత జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియాతో ఈ నెల‌ 19న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండటం ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి వన్డే తర్వాత, 23న అడిలైడ్‌లో, 25న సిడ్నీలో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి.
RO-KO
Virat Kohli
Rohit Sharma
India cricket
Pakistan fan
Perth
Australia tour
Cricket autograph
Shubman Gill
India vs Australia
Cricket series

More Telugu News