Nara Lokesh: ప్రభుత్వ కొనసాగింపుతో ఏపీ నెంబర్ వన్ కావడం గ్యారంటీ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says AP will be number one with continued government
  • ఏపీపై ప్రధానికి అపారమైన ప్రేమ.. అడిగినవన్నీ ఇస్తున్నారన్న లోకేశ్
  • నన్నూరులో "సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్" బహిరంగ సభ
  • ప్రధాని మోదీపై నారా లోకేశ్ ప్రశంసలు
 స్థిరమైన ప్రభుత్వం కొనసాగితేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని, ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం వల్లే భారతదేశం ప్రపంచంలో పదో స్థానం నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్‌పోస్ట్ సమీపంలో నిర్వహించిన "సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్" బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

ఇక్కడి ప్రజలంటే ఆయనకు ప్రేమ

ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా ప్రధాని మోదీజీకి అపారమైన ప్రేమ. 16 నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు, మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నంబర్ వన్ కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. గుజరాత్ లో ప్రభుత్వ కొనసాగింపు వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ప్రధాని కావడం వల్లే ప్రపంచంలో 10 నుంచి 4వ అతి పెద్ద ఎకానమీగా అభివృద్ధి చెందింది. 

సంక్షేమం - అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటివి, కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నంబర్ వన్ కావడం గ్యారంటీ. పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ పవర్ ప్లేసెస్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటీష్ వాళ్ళను గడగడ లాడించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారు, ముత్తుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు.

రెండు పండుగలు ఒకేసారి!

సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ తో దసరా, దీపావళి కలిపి ఒకేసారి వచ్చినట్లుగా ఉంది. అలాంటి సూపర్ పండుగను 140 కోట్ల ప్రజలకు అందించారు మన ప్రధాని నమో. పేద, మధ్య తరగతి ప్రజల పై పన్నుల భారం తగ్గించారు. ట్యాక్స్ తగ్గడం వలన ఒక్కో పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి 15 వేలు మిగులుతుంది. జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు దేశానికి లాభం జరుగుతుందని నమో అన్నారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం... ఇలా పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు పై జీఎస్టీ తగ్గించారు. జీఎస్టీ తగ్గడంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. 

పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండగ. పేద ప్రజల ఆనందమే మన నమోకి పండగ. పేదరికం లేని దేశమే మన నమో కల. జీఎస్టీ తగ్గించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్న తరువాత మన ఫైనాన్స్ మంత్రి కేశవ్ వచ్చి దాదాపు 8 వేల కోట్లు నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు ... పేద ప్రజలకు 8 వేల కోట్ల లాభం జరుగుతుంది కదా అని సీఎం అన్నారు. నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే, దానికి చంద్రబాబు గారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.

మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు

కేంద్రంలో మన నమో ... రాష్ట్రంలో మన సీబీఎన్. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. ప్రధాని సహాయంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. పోలవరం పనులు వేగవంతం అయ్యాయి. అమరావతి పనులు వేగంగా జరగడానికి, కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరిస్తున్నారు. 

ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రం లో ఏర్పాటు చెయ్యమని కంపెనీ వాళ్లను కోరినప్పుడు వాళ్లు మాకు మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. వెంటనే మన ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి చెప్పిన వెంటనే ఆయన దానికి అంగీకరించారు. నమో సహకారం వల్లే భారత్ లో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. గూగుల్, స్పేస్ సిటీ , డ్రోన్ సిటీ, కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్.

దానికి ప్రత్యామ్నాయం లేదు... వాళ్లకు దిమ్మదిరిగిపోయింది!

నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత దేశానికి ప్రధానిగా నమో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు. 25 ఏళ్లు అధికారంలో ఉన్నా మన నమో మొదటి రోజు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ అంతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. గుజరాత్ ను పవర్ ఫుల్ స్టేట్ గా మార్చారు. ఇప్పుడు భారత దేశాన్ని సూపర్ పవర్ గా మారుస్తున్నారు.

గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు. మన దేశ ప్రభుత్వాలు యూఎన్ దగ్గరకో, ఇతర దేశాల దగ్గరకో వెళ్లి సాయం కోరేవారు. మన నమో రూటే సెపరేటు. పహల్గాంలో నమో కొట్టిన దెబ్బకి పాకిస్థాన్ దిమ్మ తిరిగిపోయింది. అమెరికా ట్యాక్సులు పెంచితే పెద్ద పెద్ద దేశాలు కూడా వణికిపోయాయి. నమో ఆత్మనిర్బర్ భారత్ వంటి కార్యక్రమాలతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. నమోకి దేశ ప్రజలు అంటే నమ్మకం.. మనకి నమో అంటే నమ్మకం. ఆ నమ్మకమే దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
AP development
Chandrababu Naidu
Narendra Modi
GST savings
Andhra Pradesh
Kurnool
Double engine government
AP No 1

More Telugu News