Telangana Tourism: తెలంగాణ అడవుల్లో సినిమా షూటింగ్‌లు.. 24 గంటల్లోనే అనుమతులు

Telangana 24 Hour Permission for Film Shoots in Forests
  • తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అటవీ ప్రాంతాల్లో అనుమతి
  • సుమారు 70 లొకేషన్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు.. కేవలం 24 గంటల్లోనే పర్మిషన్లు
  • 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక సింగిల్ విండో వెబ్‌సైట్
  • రోజుకు రూ.50 వేల ఫీజుతో చిత్రీకరణకు అవకాశం
  • సినీ, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యం
తెలంగాణలో సినీ పరిశ్రమకు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతూ, దరఖాస్తు చేసుకున్న కేవలం 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం సినీ నిర్మాతలకు సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేయనుంది.

'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' పేరిట‌ ప్రత్యేక వెబ్‌సైట్‌
ఈ నూతన విధానంలో భాగంగా 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ' పేరుతో ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. షూటింగ్‌లకు అవసరమైన అన్ని అనుమతులను ఈ పోర్టల్ ద్వారానే పొందవచ్చు. అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 24 గంటల్లోనే అనుమతి లభిస్తుంది. ఒకవేళ ఏవైనా సాంకేతిక కారణాలతో ఆలస్యమైనా, ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుపుకోవడానికి వెసులుబాటు కల్పించడం విశేషం.

సుమారు 70 లొకేషన్ల గుర్తింపు
అటవీ శాఖ అధికారులు సినీ పరిశ్రమ వర్గాలతో చర్చించి, షూటింగ్‌లకు అనువుగా ఉండే సుమారు 70 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో వికారాబాద్, అమ్రాబాద్, నర్సాపూర్, వరంగల్, ఆదిలాబాద్‌లోని దట్టమైన అడవులతో పాటు హైదరాబాద్ శివార్లలోని 52 అర్బన్ ఫారెస్ట్ పార్కులు కూడా ఉన్నాయి. నారపల్లి నందనవనంలోని జింకల పార్కు, చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్‌, కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వంటివి ఈ జాబితాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ లొకేషన్లలో చిత్రీకరణకు రోజుకు రూ.50 వేల రుసుమును ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు (ఎఫ్‌డీసీ) ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్‌కు 60 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోనే అనేక సుందరమైన లొకేషన్లు అందుబాటులోకి రావడంతో చిత్ర పరిశ్రమకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చార్మినార్ సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్‌ను నోడల్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది.
Telangana Tourism
Telangana
Film in Telangana
Movie shooting permission
Telangana forests
Vikharabad forests
Amrabad
Narsapur
Warangal
Adilabad

More Telugu News