Narendra Modi: నన్నూరు సభ వేదికగా... వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

Narendra Modi launches projects worth crores in Nannur meeting
  • కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
  • మొత్తం రూ.13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం
  • రూ.9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్
  • పలు రహదారి, రైల్వే, గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ప్రారంభం
  • పూర్తయిన పనులను జాతికి అంకితం చేసిన ప్రధాని
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఊతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఏకంగా రూ.13,340 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' సభ వేదికగా ఆయన ఈ అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాని మోదీ రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, మరో రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రూ.2,276 కోట్ల విలువైన పనులను ఆయన జాతికి అంకితం చేశారు.

రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట

కొత్తగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఉన్నాయి. వీటి నిర్మాణానికి రూ.4,920 కోట్లు కేటాయించారు. కర్నూలులో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి రూ.2,880 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా ప్రధాని పునాదిరాయి వేశారు. వీటితో పాటు, రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి, రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌కు, రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఫ్లైఓవర్ లైన్‌కు శంకుస్థాపన చేశారు.

ప్రారంభమైన, జాతికి అంకితమైన ప్రాజెక్టులు

ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా పలు పూర్తయిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. రూ.286 కోట్లతో నిర్మించిన కడప-నెల్లూరు-చునియంపల్లి రహదారులను, రూ.593 కోట్లతో పూర్తి చేసిన పీలేరు-కాలూరు సెక్షన్ నాలుగు లేన్ల రహదారిని ప్రారంభించారు.

అంతేకాకుండా, రూ.546 కోట్ల విలువైన కొత్తవలస-కోరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులను, రూ.1,730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం-అంగుల్ సహజవాయువు పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, రవాణా రంగాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు.
Narendra Modi
Andhra Pradesh development
Kurnool projects
Rayalaseema development
Orvakal industrial corridor
Kopparthi industrial corridor
National highway projects
Railway line projects
Power transmission system
Srikakulam Angul pipeline

More Telugu News