Pawan Kalyan: మోదీ ఒక కర్మయోగి.. ఆయన రెండు తరాలను నడుపుతున్నారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Praises Modi as Karma Yogi Leading Two Generations
  • ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం
  • ఫలితం ఆశించని కర్మయోగి మోదీ అని కితాబు
  • కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశ సేవే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు. కర్నూలు శివారు నన్నూరు వద్ద నిర్వహించిన ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ప్రధాని మోదీ కేవలం దేశాన్ని మాత్రమే కాకుండా, ఏకంగా రెండు తరాలను ముందుకు నడిపిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో దేశం తలెత్తుకునేలా చేశారు. భారత పతాకానికి ఉన్న పౌరుషంలాగే, ప్రపంచ పటంలో దేశ ప్రతిష్ఠను ఆయన నిలబెట్టారు" అని అన్నారు.

కూటమి బలోపేతంపై కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మన కూటమి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడాలి. కనీసం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా కొనసాగాలి" అని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక తరం భవిష్యత్తు కోసం ఆలోచించే గొప్ప నాయకుడని కీర్తించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా సమష్టిగా పనిచేస్తామని, రాబోయే తరాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 
Pawan Kalyan
Narendra Modi
Chandrababu Naidu
Andhra Pradesh
Kurnool
Super GST Super Savings
India
Atmanirbhar Bharat
AP Deputy CM
Political Alliance

More Telugu News