Praveen Kumar: మధ్యాహ్న భోజనంలో కప్ప.. మహబూబ్ నగర్ జిల్లా స్కూలులో కలకలం

Frog Found in Midday Meal at Lal Kota School Mahabubnagar
  • పప్పులో కప్ప కనిపించడంతో విద్యార్థులు షాక్
  • అప్పటికే భోజనం పూర్తిచేసిన కొందరు విద్యార్థులు
  • పాఠశాలకు చేరుకుని టీచర్లపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు
మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోని విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో కప్ప కనిపించడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. అప్పటికే కొంతమంది విద్యార్థులు భోజనం చేయడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని సీసీకుంట మండలం లాల్‌కోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం సుమారు 270 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఓ విద్యార్థికి పప్పు వడ్డిస్తుండగా అందులో నుంచి చనిపోయిన కప్ప బయటపడింది. దీంతో భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేయడంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే, ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని సమాచారం.

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, లాల్‌కోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కప్ప వచ్చినట్లు ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ధృవీకరించారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని ఆయన తెలిపారు.
Praveen Kumar
Mahabubnagar
Midday Meal
Frog in Food
School Lunch
Lal Kota School
Government School
Telangana Education
District Education Officer
Food Poisoning

More Telugu News