Rahul Gandhi: మోదీకి ట్రంప్ అంటే భయం.. అందుకే రష్యా ఆయిల్‌పై మౌనం: రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams Modi Over Trumps Russia Oil Claim
  • రష్యా నుంచి చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్
  • మోదీకి ట్రంప్ భయం పట్టుకుందంటూ రాహుల్ ఎద్దేవా
  • సెప్టెంబర్‌లోనూ రష్యా నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి
  • ట్రంప్ ప్రకటనపై ఇంకా స్పందించని కేంద్ర ప్రభుత్వం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ అంటే భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించక ముందే రాహుల్ ఈ విమర్శలు చేయడం గమనార్హం.

ప్రధాని నరేంద్ర మోదీని 'గొప్ప వ్యక్తి' అని, భారత్‌ను 'అద్భుతమైన దేశం' అని పొగిడిన ట్రంప్, అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని మోదీ తనకు హామీ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రక్రియ వెంటనే పూర్తికాదు. కానీ త్వరలోనే ముగుస్తుంది. వారు తక్కువ సమయంలోనే రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తారు" అని ట్రంప్ విలేకరులతో అన్నారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఘాటుగా స్పందించారు. "ప్రధాని మోదీకి ట్రంప్ అంటే భయం" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. "రష్యా నుంచి ఆయిల్ కొనబోమని చెప్పే నిర్ణయాన్ని, ఆ ప్రకటనను కూడా ట్రంప్‌కే వదిలేశారు. ఎన్నిసార్లు అవమానించినా అభినందన సందేశాలు పంపుతూనే ఉన్నారు. ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను కూడా రద్దు చేశారు" అని రాహుల్ ఆరోపించారు.

గత సెప్టెంబర్ నెలలో కూడా భారత్ తన మొత్తం ముడిచమురు దిగుమతుల్లో 34 శాతం రష్యా నుంచే కొనుగోలు చేసింది. భారత్ ఇప్పటికీ రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు అమెరికా నుంచి సరైన ధరకు లభిస్తే సుమారు 12-13 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.
Rahul Gandhi
Donald Trump
Narendra Modi
Russia oil
India Russia relations
India US relations
Crude oil imports
Indian economy
Oil purchase
US trade

More Telugu News