Konda Susmitha: రెడ్లు అంతా కలిసి మాపై కుట్ర పన్నారు: కొండా సురేఖ కూతురు సుస్మిత

Konda Susmitha Alleges Conspiracy by Reddys Against Them
  • జూబ్లీహిల్స్‌లోని సురేఖ నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామా
  • మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టుకు యత్నం
  • పోలీసులను అడ్డుకున్న సురేఖ కూతురు సుస్మిత
  • అరెస్ట్ వారెంట్ ఉందా? అని అడిగిన సుస్మిత
  • రేవంత్, ఉత్తమ్, పొంగులేటిపై ఆరోపణలు
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద నిన్న రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్‌ను అరెస్టు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.

జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి కుమార్తె కొండా సుస్మిత పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. "మేం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్నామా? వేరే ప్రభుత్వంలో ఉన్నామా? ప్రభుత్వంలో ఉన్న వారిపైనే ఇలా వ్యవహరిస్తారా?" అని ఆమె పోలీసులను నిలదీశారు. అరెస్ట్ వారెంట్ చూపించాలని పోలీసులను అడిగారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సుస్మిత, సొంత ప్రభుత్వంలోని నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతోనే తన తల్లిని అణగదొక్కేందుకు పార్టీలోని కొందరు 'రెడ్లు' కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. తన తండ్రి కొండా మురళికి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్‌తో బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. అయితే, సీఎం సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సుమంత్ ఆ కంపెనీకి వెళ్లారని, మరి రోహిన్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు విస్మరించారని సుస్మిత ప్రశ్నించారు. ఒక మంత్రి ఇంట్లోకి పోలీసులు రాత్రిపూట రావడం, ఆమె కుమార్తె సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. 
Konda Susmitha
Konda Surekha
Revanth Reddy
Ponguleti Srinivas Reddy
Uttam Kumar Reddy
Telangana Congress
Sumanth OSD
Jubilee Hills
Political conspiracy

More Telugu News