PM Modi: రాయలసీమ అభివృద్ధికి కొత్త శకం.. నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi Visits Andhra Pradesh Launches Development Projects Today
  • నేడు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక
  • రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం
  • కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని
  • ‘సూపర్ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌’ సభలో పాల్గొననున్న మోదీ
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరు
ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సుమారు రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన శ్రీశైలం, కర్నూలులో జరగనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్నూలులో డ్రోన్ సిటీకి అంకురార్పణ
ప్రధాని పర్యటనలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద నిర్మించ తలపెట్టిన డ్రోన్ సిటీ అత్యంత కీలకం కానుంది. 350 ఎకరాల్లో తొలిదశలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఏటా రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. దీనితో పాటు విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.

‘సూపర్‌ జీఎస్టీ’ సభలో ప్రధాని
అనంతరం కర్నూలులో జరిగే ‘సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌’ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను, వాటి ఫలాలను వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదట శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. మొత్తం మీద ప్రధాని పర్యటన రాష్ట్రంలో సుమారు ఆరున్నర గంటల పాటు కొనసాగనుంది.

భారీ భద్రతా ఏర్పాట్లు, సీఎం సమీక్ష
ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు బుధవారం మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసి, రాష్ట్రానికి అండగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా స్వయంగా పర్యవేక్షించారు. సుమారు 7,500 మందికి పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఏపీకి వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్‌
తన పర్యటనపై ప్రధాని మోదీ కూడా తెలుగులో ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఏపీ ప్రజలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. తన పర్యటన వివరాలను వెల్లడిస్తూ బుధవారం ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘‘అక్టోబరు 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్‌, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
PM Modi
Narendra Modi
Andhra Pradesh
AP Development
Kurnool Drone City
Srisailam Temple
GST 2.0
Chandrababu Naidu
Pawan Kalyan
AP Projects
Harish Kumar Gupta

More Telugu News