Chandrababu Naidu: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు యాప్ తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. మందు ఒరిజినలా? కాదా? మనమే చెక్ చేసుకోవచ్చు

Chandrababu Naidu launches Excise Suraksha app to curb fake liquor in Andhra Pradesh
  • నకిలీ మద్యంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
  • ‘ఎక్సైజ్ సురక్ష’ పేరుతో సరికొత్త యాప్ ప్రారంభం
  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా యాప్ ఆవిష్కరణ
  • మద్యం బాటిల్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్‌తో గుర్తింపు
  • కొన్నది అసలు మద్యమో, నకిలీదో వెంటనే తెలిసిపోతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కల్తీ మద్యాన్ని గుర్తించి, దాని బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు ‘ఎక్సైజ్ సురక్ష’ పేరుతో ఒక సరికొత్త మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులే స్వయంగా తాము కొనుగోలు చేసిన మద్యం అసలైనదో కాదో సులభంగా తెలుసుకునే వీలు కలుగుతుంది.

ఇకపై రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం బాటిల్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధన విధించింది. మద్యం కొనుగోలు చేసినవారు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘ఎక్సైజ్ సురక్ష’ యాప్‌తో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన వెంటనే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీని ద్వారా అది ప్రభుత్వ అనుమతి పొందిన అసలైన మద్యమా లేక నకిలీదా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీతో కల్తీ మద్యం దందాను సమూలంగా నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించనట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేక సూచీలు ఏర్పాటు చేయాలి. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్, ప్రామాణికతను తనిఖీ చేయాలి. ప్రతి దుకాణం, బార్‌లో రోజువారీ మద్యం విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్‌ను నమోదు చేయాలి. ఎక్సైజ్ సిబ్బంది మద్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ వివరాలను అక్కడ ఉన్న రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

డిపో నుండి మద్యం అందిన తర్వాత కనీసం 5 శాతం సీసాలను స్కాన్ చేయాలి. నకిలీ మద్యాన్ని గుర్తిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయాలి. నకిలీ మద్యం గుర్తిస్తే లైసెన్స్ రద్దు చేసి, తదుపరి విచారణ చర్యలు చేపట్టాలి. నకిలీ మద్యంపై ఫిర్యాదు చేసేందుకు పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలి. ఫిర్యాదులను కూడా ఇరవై నాలుగు గంటల్లోనే విచారించి నివేదించాలి.

కాగా, ‘ఎక్సైజ్ సురక్ష’ యాప్ వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని బార్లు, వైన్ షాపుల వద్ద ‘ఎక్సైజ్ సురక్ష’ యాప్‌ను ఎలా ఉపయోగించాలో వివరించే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా వినియోగదారుల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ మద్యం మాఫియాకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
Chandrababu Naidu
Andhra Pradesh
Excise Suraksha app
AP government
Fake liquor
Counterfeit alcohol
QR code
Wine shops
Liquor sales
AP Excise Department

More Telugu News