Nara Lokesh: సమిష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్ రాక... అందరం గర్వపడాల్సిన సమయం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh on Googles Investment in Andhra Pradesh
  • విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్
  • భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ ఎఫ్‌డీఐ అన్న మంత్రి లోకేశ్‌
  • ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంద‌ని వ్యాఖ్య‌
  • గూగుల్ రాకుండా వైసీపీ నేతలు మెయిల్స్ పెట్టారని ఆరోపణ
  • రాబోయే రోజుల్లో ప్రతివారం ఒక కొత్త ప్రాజెక్టు ప్రకటన ఉంటుందని వెల్ల‌డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్‌ ఈ వివరాలు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్రానికే కాదని, యావత్ భారతదేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని తెలిపారు. ఈ ఒక్క పెట్టుబడితోనే రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,000 ఉద్యోగాలు లభిస్తాయని, రాబోయే ఐదేళ్లలో స్థానిక ఆర్థిక వ్యవస్థపై దాదాపు రూ.48 వేల కోట్ల సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు. "గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలను మార్చినట్లే, ఇప్పుడు గూగుల్ విశాఖ దశను మార్చబోతోంది" అని లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఈ భారీ ప్రాజెక్టును సాధించడం వెనుక సీఎం చంద్రబాబు దార్శనికత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి ఉందని లోకేశ్‌ తెలిపారు. గూగుల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల్లో కీలక సవరణలు చేసిందని, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంపూర్ణ సహకారం అందించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇంత వేగంగా పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్‌ విమర్శలు 
గత వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా లోకేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి గూగుల్ రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఆ సంస్థకు వ్యతిరేకంగా మెయిల్స్ పంపారని ఆయన ఆరోపించారు. వారి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని, పెట్టుబడిదారులు భయపడి పారిపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇకపై ప్రతి వారం ఒక కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని లోకేశ్‌ స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
Google
Visakhapatnam
Data Center
Investment
FDI
Chandrababu Naidu
AP Development
Job Creation

More Telugu News