రోడ్లన్నీ గుంతలే, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం.. మేం పన్నులు ఎందుకు కట్టాలి?
- కర్ణాటక సీఎంకు టాక్స్ ఫోరం సభ్యుల లేఖ
- ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయకుండా గ్రేటర్ బెంగళూరు అధికారులను ఆదేశించాలని వినతి
- డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండా రోడ్లపై గుంతలను పూడ్చేస్తే ప్రయోజనమేంటని ప్రశ్న
ఇటీవల రోడ్లపై గుంతల విషయంలో సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధికారులు స్పందించి వాటిని పూడుస్తున్నారని టాక్స్ పేయర్స్ ఫోరం పేర్కొంది. అయితే, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండా రోడ్లపై గుంతలను పూడ్చడం వల్ల ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించింది. ఇటీవలి వర్షాలకు బెంగళూరులో పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం గుర్తుచేస్తూ.. డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తే వరద ముప్పు తప్పుతుందని వెల్లడించింది. ప్రజలకు సేవలందించే విషయంలో అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని తన లేఖలో కోరింది.
ఉపముఖ్యమంత్రి డీకే స్పందన..
బెంగళూరు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేస్తూ.. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలను పూడ్చివేసే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 13 వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. రోడ్లపై గుంతలు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా రూ.1100 కోట్లతో బెంగళూరులోని 550 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు.