Chandrashekhar Madhukar Kalekar: సినిమాను మించిన ఛేజింగ్.. 48 ఏళ్ల పాత కేసును ఛేదించిన పోలీసులు

Mumbai Police Solve 48 Year Old Attempted Murder Case Chandrashekhar Kalekar Arrested
  • 1977 నాటి హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
  • 48 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పరారీ
  • రత్నగిరి జిల్లా దాపోలిలో పట్టుకున్న ముంబై పోలీసులు
  • బెయిల్‌పై బయటకు వచ్చి అదృశ్యమైన నిందితుడు
  • పదేళ్ల క్రితం నాటి రోడ్డు ప్రమాదం కేసుతో చిక్కిన ఆచూకీ
  • 71 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లిన వైనం
దాదాపు అర్ధ శతాబ్దం పాటు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుడిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 48 ఏళ్ల క్రితం నాటి హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు 71 ఏళ్ల వయసులో పోలీసులకు చిక్కడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సుదీర్ఘ వేటకు ఒక పాత రోడ్డు ప్రమాదం కేసు కీల‌కంగా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
1977లో ముంబైలోని కొలాబా ప్రాంతంలో చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ అనే 23 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, కొద్దిరోజులకే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరుకాకుండా అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఎన్ని వారెంట్లు జారీ చేసినా ఆచూకీ లభించకపోవడంతో అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించారు.

దాదాపు 48 ఏళ్లుగా మూలనపడిన ఈ కేసును ఆరు నెలల క్రితం కొలాబా పోలీసులు మళ్లీ తెరిచారు. కాలేకర్ పాత చిరునామా అయిన లాల్‌బాగ్‌లోని హాజీ కాసమ్ చాల్‌కు వెళ్లి చూడగా, ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయి కొత్త భవనం వెలసింది. ఓటర్ల జాబితాతో పాటు ఇతర ప్రభుత్వ రికార్డులను జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది.

ఈ క్రమంలో రవాణా శాఖ, కోర్టు రికార్డులను పరిశీలిస్తున్న పోలీసులకు ఒక కీలక ఆధారం లభించింది. రత్నగిరి జిల్లాలోని దాపోలి పోలీస్ స్టేషన్‌లో 2015లో కాలేకర్‌పై రోడ్డుపై జరిగిన గొడవకు సంబంధించి ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. ఆ కేసులో ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు సోమవారం రాత్రి దాపోలిలోని అతడి ఇంటికి చేరుకున్నారు. 48 ఏళ్ల తర్వాత తమ ఇంటి తలుపు తట్టిన పోలీసులను చూసి కాలేకర్ నిర్ఘాంతపోయాడు. "అసలు ఆ పాత కేసు గురించే దాదాపు మరిచిపోయానని, పోలీసులను చూసి షాక్‌కు గురయ్యానని" విచారణలో అంగీకరించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

నేరం జరిగినప్పుడు 23 ఏళ్ల యువకుడిగా ఉన్న కాలేకర్, ఇప్పుడు 71 ఏళ్ల వృద్ధుడిగా పూర్తిగా మారిపోవడంతో పాత ఫొటోలతో గుర్తుపట్టడం కష్టమైంది. అయితే, విచారణలో తానే ఆ నేరం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Chandrashekhar Madhukar Kalekar
Mumbai Police
attempted murder case
Kolaba
Haji Kassam Chal
Dapoli
Ratnagiri district
crime news
police investigation
old case solved

More Telugu News