Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత?

Pawan Kalyan New Projects Uncertain Due to Political Duties
  • రాజకీయాల్లోకి వచ్చినా ఆగని పవన్ సినిమాలు
  • 'ఓజీ'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్
  • పూర్తయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
  • కొత్త ప్రాజెక్టులపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వని పవన్
  • ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్న విశ్వసనీయ వర్గాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినీ కెరీర్‌కు కొంత విరామం ఇస్తారేమోనని అభిమానులు భావించారు. అయితే, తాను గతంలో అంగీకరించిన సినిమాలను పూర్తి చేస్తూ అభిమానులను పవన్ అలరిస్తున్నారు. ఇటీవలే 'ఓజీ'తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం ఏ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్‌ను కూడా పవన్ ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్ చేయబోయే సినిమా ఏది అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన వరుసగా కొత్త సినిమాలు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ ఇప్పటివరకు ఏ కొత్త కథనూ ఖరారు చేయలేదని తెలుస్తోంది. రాజకీయ బాధ్యతల కారణంగా ఆయన కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
Pawan Kalyan
Pawan Kalyan movies
OG movie
Ustad Bhagat Singh
Telugu cinema
Tollywood
Sujith
Harish Shankar
Andhra Pradesh Deputy CM

More Telugu News